సన్నాలపై సందిగ్ధం! | - | Sakshi
Sakshi News home page

సన్నాలపై సందిగ్ధం!

Jun 29 2026 1:41 AM | Updated on Jun 29 2026 1:41 AM

● ఎనిమిది రకాలకే ప్రాధాన్యమిస్తున్న వ్యవసాయశాఖ ● బోనస్‌పై రైతుల మల్లగుల్లాలు

హుజూరాబాద్‌: వానాకాలం సీజన్‌ ప్రారంభం కానున్న తరుణంలో వరిసాగుపై ప్రభుత్వ నిర్ణయం రైతులను అయోమయంలోకి నెట్టింది. దొడ్డు రకాలు తగ్గించి, సన్నరకాల సాగును ప్రోత్సహించాలని వ్యవసాయశాఖ నిర్ణయించగా ఈ విషయంలో స్పష్టత ఇవ్వడం లేదు. హుజూరాబాద్‌ డివిజన్‌లోని ఇల్లందకుంట మండలంలో 12,000 ఎకరాలు, హుజూరాబాద్‌ మండలంలో 22,800 ఎకరాలు, జమ్మికుంట మండలంలో 14,500 ఎకరాలు, సైదాపూర్‌ మండలంలో 19చ500 ఎకరాలు, వీణవంక మండలంలో 23,000 ఎకరాల్లో వరి సాగు చేస్తుండగా ఇందులో 60 నుంచి 70శాతం సన్నవడ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు.

ప్రచారం ఒకటి.. అనుమానాలు వంద

సన్న రకాల సాగును పెంచేందుకు వ్యవసాయశాఖ ఫ్లెక్సీలు, పోస్టర్లు, కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తోంది. అయితే వ్యవసాయ విశ్వవిద్యాలయం కేవలం 8 సన్నరకాలు మాత్రమే సాగుకు సిఫార్సు చేసింది. దీంతో విశ్వవిద్యాలయం రూపొందించిన ఇతర రకాలు, ప్రైవేట్‌ కంపెనీల రకాలను సాగుచేస్తే క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ వర్తిస్తుందా? లేదా? అన్న అంశంపై రైతుల్లో తీవ్ర సందిగ్ధత నెలకొంది. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో, తాము ఏ రకాలను ఎంచుకోవాలో అర్థం కాక రైతులు అయోమయానికి గురవుతున్నారు.

గతేడాది 33 రకాలకు బోనస్‌

ప్రభుత్వం గతేడాది వానాకాలం సీజన్‌లో 33 రకాల సన్నాలకు బోనస్‌ ప్రకటించింది. ఆ రకాలకే క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్‌ చెల్లించింది. వ్యవసాయశాఖ ప్రచారం చేస్తున్న రకాల్లో బీపీటీ–5204 (సాంబమసూరి), ఆర్‌ఎన్‌ఆర్‌–15048 (తెలంగాణ సోనా), కేఎన్‌ఎం1638 (కూనారం వరి2), జేజీఎల్‌–1798 (జగిత్యాల సన్నాలు), జైశ్రీరామ్‌, హెఎంటీ సోనా, వరంగల్‌–44 (సిద్ధి), డబ్ల్యూజీఎల్‌–962 ఉన్నాయి. వీటికి బహిరంగ మార్కెట్లో డిమాండ్‌ ఉంది. ఈ రకాల పంటకాలం ఎక్కువగా ఉండటంతో పాటు చీడపీడలు, పురుగు, దోమ ఉధృతి ఎక్కువగా ఉంటుందని రైతులు ఎంటీయూ– 1262, ఎంటీయూ– 1061, ఎంటీయూ– 1124కు మొగ్గు చూపుతున్నారు. అయితే సాగుకు సమయం దగ్గర పడుతున్న తరణంలో తమకు నచ్చిన రకాలపై దృష్టి పెడుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement