కరీంనగర్‌టౌన్: నిరుపేద విద్యార్థుల నుంచి బెస్ట్ అవైలబుల్ పథకానికి దరఖాస్తులు వెల్లువెత్తాయి. ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలకు చెందినవారికి ఈ పథకం కింద కార్పొరేట్ పాఠశాలలో చదువుకునే అవకాశం కల్పిస్తుంది. ఇప్పటికే జిల్లాలో రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ పద్ధతిలో 11 ప్రైవేటు పాఠశాలల్లో 673 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వం తాజాగా 2026–27 విద్యా సంవత్సరానికి గాను 1వ, 5వ తరగతిలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లా వ్యాప్తంగా 120 సీట్లు ఖాళీ ఉండగా 289 మంది దరఖాస్తులు చేసకున్నారు. నాన్ రెసిడెన్షియల్, రెసిడెన్షియల్ పాఠశాలలో మొత్తంగా 120 సీట్లకు ఒకటో తరగతికి నాన్ రెసిడెన్షియల్, ఐదో తరగతికి రెసిడెన్షియల్‌లో ప్రవేశం ఉంటుంది.
ఎంపికై న పాఠశాలలు ఇవే..
జిలాల్లో బెస్ట్ అవైలబుల్ పథకం కింద ఎంపికై న పాఠశాలలు తొమ్మిది ఉన్నాయి. మరో నాలుగు పాఠశాలలు దరఖాస్తు చేసుకున్నాయి. నందిని కాన్వెంట్, సెయింట్ ఆల్పోన్స్(కరీంనగర్), వివేకానంద విద్యానికేతన్(గంగాధర), టెట్రా హైడ్రన్ స్కూల్, మాంటిస్సోరీ(హుజూరాబాద్), న్యూమిలినియన్, విద్యోదయ, మాస్టర్ ఎస్‌వీ, శ్రీకాకతీయ(జమ్మికుంట). కొత్తగా దరఖాస్తు చేసుకున్న పాఠశాలలు లయోలా స్కూల్, విజ్ఞాన్ స్కూల్(కరీంనగర్), కాకతీయ స్కూల్(గంగాధర), కేరళ స్కూల్(హుజూరాబాద్).
పేద విద్యార్థులకు వరం
ఎస్సీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది. ఎంపికై న వారికి పదో తరగతి వరకు ఉచితంగా మెరుగైన విద్య అందిస్తాం. ఉచిత వసతులు కల్పిస్తాం. దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది. త్వరలో కలెక్టర్ ఆధ్వర్యంలో లక్కీడ్రా ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది.
– వై.తిరుపతిరావు,
జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి


