కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి రూ.25 కోట్లు కేటాయించినట్లు మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం 53వ డివిజన్ పరిధిలోని మంచిర్యాల చౌరస్తా, శర్మనగర్ తదితర ప్రాంతాల్లో నాలా, లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వర్షాకాలం వరదతో నగరంలోని పలు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయన్నారు. ముంపు సమస్య శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టామన్నారు. స్మార్ట్‌సిటీ నిధులు రూ.25 కోట్లతో ముంపు సమస్యలను తీర్చనున్నామని తెలిపారు. ఇందుకోసం డీపీఆర్,టెండర్ ప్రక్రియలు పూర్తి చేసి త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ లోగా మురుగునీరు, వరద సాఫీగా నాలాలు, డ్రైనేజీల ద్వారా వెళ్లేందుకు చర్యలు తీసుకొంటున్నామని అన్నారు. మురుగు కాలువల్లో ప్లాస్టిక్, చెత్త వేయవద్దని, పూడికతీత పనుల సమయంలో మట్టికన్నా ఎక్కువగా ప్లాస్టిక్ వ్యర్థాలు బయటపడుతున్నాయన్నారు.
అభివృద్ధి పనులు ప్రారంభం
నగరంలోని అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం నగరపాలకసంస్థ 31వ డివిజన్ దుర్గమ్మగడ్డ,ఖాన్‌పూర రోడ్ నెం.11 వద్ద రూ.15 లక్షల నగరపాకలసంస్థ సాధారణ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు, సీసీ డ్రెయిన్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, 31వ డివిజన్ కార్పొరేటర్ ముఖద్దర్ హుస్సేన్ పాల్గొన్నారు.


