కరీంనగర్ కార్పొరేషన్: బీఆర్‌ఎస్ హయాంలో ఇదే సీజన్‌లో ఎల్‌ఎండీలో 15 టీఎంసీల నీళ్లున్నట్లు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరూపించాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి సవాల్ విసిరారు. లేదంటే పదవికి రాజీనామా చేసి ముక్కునేలకు రాయాలని డిమాండ్ చేశారు. శనివారం సాయంత్రం ఎల్‌ఎండీ నీటిమట్టాన్ని పరిశీలించి మాట్లాడారు. మానేరు డ్యాంలో నీళ్లు లేవని, తమ హయాంలో 15 టీఎంసీల నీళ్లు ఉండేవని ప్రజలను ఎమ్మెల్యే తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. డ్యాంలో ఆటల పేరుతో డ్రామాలాడారని విమర్శించారు. తాను అధికారిక ఆధారాలు చూపిస్తున్నానని, 15 టీఎంసీల నీళ్లు ఎప్పుడూ లేవన్నారు. దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలని, నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానన్నారు. నిరూపించకపోతే ఎమ్మెల్యే పదవికి కమలాకర్ రాజీనామా చేయాలన్నారు. ఇప్పుడున్న 5.8 టీఎంసీలలో డెడ్ స్టోరేజ్ పోను 2 టీఎంసీలు తాగునీటికి సరిపోతాయన్నారు. ఇలాంటి డ్రామాలు ఆపకపోతే డ్యాంలో ఫుట్‌బాల్ ఆడినట్లే, ప్రజలు బీఆర్‌ఎస్ నాయకులను ఫుట్‌బాల్ ఆడుతారని హెచ్చరించారు. అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, పర్వతాల మల్లేశం, గోపు మల్లారెడ్డి, లయాక్, చర్ల పద్మ, నెల్లి నరేశ్, షబానా మహమ్మద్, ముల్కల కవిత, జ్యోతిరెడ్డి, అస్థాపురం తిరుమల, మహాలక్ష్మి, కంది అశోక్‌రెడ్డి, బషీర్, షెహన్షా, మాసుం ఖాన్, రాజ్‌కుమార్, హనీఫ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.


