కరీంనగర్‌సిటీ: వారిది నిరుపేద చేనేత కుటుంబం.. తల్ల్లి బీడీ కార్మికురాలు.. తల్లికి చేదోడువాదోడుగా బీడీలు చేస్తూ తన విద్యాభ్యాసాన్ని కొనసాగించింది పెద్దపల్లి జిల్లా ఎలిగేడుకు చెందిన శ్రీవాణి. ఆమె చదువు ప్రభుత్వ విద్యాసంస్థల్లో ర్యాంకులు, బంగారు పతకాలతో సాగింది. ఎలిగేడు జెడ్పీ స్కూల్‌లో 10వ తరగతి ప్రథమ శ్రేణిలో, కరీంనగర్ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో అన్ని సబ్జెక్టుల్లో మొదటి ర్యాంకు సాధించింది. కరీంనగర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీఏలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో 9వ ర్యాంకు, ఎంఏ ఎకనామిక్స్‌లో ఫస్ట్ ర్యాంకుతో 3 బంగారు పతకాలు సాధించింది. ఒకే ఏడాదిలో ఆరు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ప్రస్తుతం శాతవాహన యూనివర్సిటీలో అర్థశాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. శ్రీవాణి విద్యారంగంలో అత్యున్నతంగా రాణిస్తున్నందుకు అవార్డులు అందుకున్నారు. శ్రీవాణి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక, సామాజిక కారణాలతో చాలామంది బయటకు రాలేకపోతున్నారన్నారు. అలాంటివారిని గుర్తించి తీర్చిదిద్దుతానని, శాతవాహన యూనివర్సిటీ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని తెలిపారు.


