సీపీ వర్సెస్‌ పాడి! | - | Sakshi
Sakshi News home page

సీపీ వర్సెస్‌ పాడి!

Mar 3 2026 8:22 AM | Updated on Mar 3 2026 8:22 AM

సీపీ వర్సెస్‌ పాడి!

వీడియోల్లో ఏముంది?

పోలీసులు అవినీతిపరులు అంటూ ఎమ్మెల్యే ఆరోపణలు

వ్యాపారుల వద్ద వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శలు

నిరాధార ఆరోపణలు అని ఖండించిన డిపార్ట్‌మెంట్‌

వ్యక్తిగత కక్షతోనే ఆరోపణలంటున్న పోలీసులు

వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలన్న పోలీసు సంక్షేమ సంఘం

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌:

రీంనగర్‌ పోలీసులు లక్ష్యంగా హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మరోసారి వాగ్బాణాలు సంధించడం రాష్ట్రవ్యాప్త చర్చకు దారితీస్తోంది. ఇటీవల పోలీసు కమిషనర్‌ గౌస్‌ ఆలం లక్ష్యంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన పాడి ఆ తరువాత తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తాజాగా ఆయనే మరోసారి సీపీ, ఇతర పోలీసులు లక్ష్యంగా అవినీతి ఆరోపణలు చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా ఓ షాపింగ్‌ విషయంలో పోలీసులు భారీగా ముడుపులు స్వీకరించారని, ఏసీపీ విజయ్‌కుమార్‌, మరో ఇన్‌స్పెక్టర్‌ సృజన్‌రెడ్డి లక్ష్యంగా బలవంతంగా డబ్బులు వసూలు చేశారని హైదరాబాద్‌లో పాడి పెట్టిన ప్రెస్‌మీట్‌తో కరీంనగర్‌ ఉలిక్కిపడింది. తన వద్ద వారి అవినీతి, అక్రమాలకు సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని, కుటుంబ సభ్యుల కోసం పోలీసు వాహనాలను దుర్వినియోగం చేస్తున్నారని, సీఎం రేవంత్‌కే ఆ ఆధారాలు చూపిస్తానని, అవసరమైతే అసెంబ్లీ వేదికగా బయటపెడతానని హెచ్చరించారు. డిపార్ట్‌మెంట్‌లో ఈ వివాదం చర్చానీయాంశంగా మారింది. తమపై ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పోలీసులు మండిపడుతుంటే.. పాడి వర్గీయులు మాత్రం తమ నేత వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని పునరుద్ఘాటిస్తున్నారు.

డిపార్ట్‌మెంట్‌ ఏమంటోందంటే?

పాడి కౌశిక్‌ డిపార్ట్‌మెంట్‌పై కావాలనే కక్ష గట్టారని సీనియర్‌ ఆఫీసర్లు ఆరోపిస్తున్నారు. ఇటీవల సమ్మక్క జాతర రోజు సీఐ సృజన్‌, సీపీ గౌస్‌ ఆలంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడమే ఇందుకు నిదర్శనమని గుర్తుచేస్తున్నారు. ఆరోజు ఆయన్ను నిలువరించడం, కేసులు నమోదు చేయడాన్ని జీర్ణించుకోలేని ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారన్నారు. కుటుంబ సభ్యులను వివాదంలోకి తీసుకురావడం తగదని హితవుపలుకుతున్నారు. వాస్తవానికి తామెవరికీ అనుకూలంగా వ్యవహరించమని, మొన్నటి వరకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనూ సేవలందించింది తామేనని మర్చిపోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులను వారికి సంబంధం లేని విషయంలో ఎమ్మెల్యే ఆరోపణలు చేయడాన్ని పోలీసు సంక్షేమ సంఘం నాయకులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. వెంటనే వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

పాడిపై మరో కేసు!

మరోవైపు సమ్మక్క జాతర సమయంలో పాడిపై కేసు నమోదు చేసిన పోలీసులు మరోసారి ఆయన వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకునే ఆలోచనలో ఉన్నారు. తొలుత లీగల్‌ ఒపినీయన్‌ తీసుకుని, దాని ఆధారంగా ముందుకు వెళ్లనున్నారు. పాడి వ్యాఖ్యలపై ఐపీఎస్‌ అధికారుల సంఘం కూడా అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. గతంలో సీపీపై అభ్యంతరకర వ్యాఖ్యల సమయంలోనూ ఐపీఎస్‌ల సంఘం క్షమాపణకు పట్టుబట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాడి చేసిన వ్యాఖ్యలపై త్వరలో కేసు నమోదు అయ్యే అవకాశం ఉందని ఓ సీనియర్‌ పోలీసు అధికారి ‘సాక్షి’కి తెలిపారు.

ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అసెంబ్లీలో బయటపెడతారన్న వీడియోల్లో ఏమి ఉండి ఉంటుంది? అన్న విషయం ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో పాడివర్గం మాత్రం పోలీసుల అక్రమాలకు సంబంధించి తమ ఎమ్మెల్యే వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. తమ నేత ఇచ్చిన గడువులోగా సీపీపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే.. అందుకు సంబంధించిన ఆధారాలు తప్పకుండా బయటపెడతారని చెబుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే సీఎం రేవంత్‌, సీఎస్‌, డీజీపీల స్పందన కోసం వేచి చూస్తున్నామని, వారి స్పందన ఆధారంగా తమ నాయకుడి ప్రతిస్పందన ఉంటుందని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement