కరీంనగర్‌అర్బన్: ప్రజావాణికి బాధితుల తాకిడి ఎక్కువైంది. వచ్చిన అర్జీలే మళ్లీ మళ్లీ రాగా తమ సమస్యలకు విముక్తి కల్పించాలని కలెక్టర్ చిత్రామిశ్రాను వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమానికి ఫిర్యాదుదారులు బారులు తీరగా ప్రధానంగా భూ సమస్యలే అధికం. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ‘రిక్వెస్ట్ చేసి చెబుతున్నా.. ప్రజలు ఎంతో ఆశతో ప్రజావాణికి వస్తుంటారు. పరిష్కారమయ్యే ఫిర్యాదులను పరిష్కరించాల్సిందే. పరిష్కారం కాని అర్జీకి ఇది కాదని చెప్పండి’ అంటూ అధికారులను హెచ్చరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీవాకడే, లక్ష్మీకిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్, ఆర్డీవో మహేశ్వర్ అర్జీలు స్వీకరించారు. మొత్తం 345 అర్జీలు వచ్చాయని కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్ వివరించారు. ఈ సందర్భంగా పలువురిని ‘సాక్షి’ పలకరించగా తమ ఆవేదనను వ్యక్తం చేశారు. వారి మాటల్లోనే..
జిల్లాస్థాయిలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ, జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీల గడువు ముగిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు దాటగా కమిటీల ఊసే లేదు. తక్షణమే కమిటీలను ఏర్పాటు చేయండి.
– తెలంగాణ జిల్లాల మాదిగ
అభివృద్ధి సంఘం ప్రతినిధులు
మేము ఇద్దరం దివ్యాంగులం. మాకు భూమిజాగాలు లేవు. నగరంలో కిరాయికి ఉంటూ వచ్చే పింఛన్‌తో బతుకీడుస్తున్నాం. మా కూతురు డిగ్రీ చదివి ఖాళీగా ఉంటోంది. ఏదైనా ఉపాధి కల్పిస్తే మాకు ఆసరాగా ఉంటుంది. వారధిలో దరఖాస్తు చేస్తే ఎలాంటి సమాచారం లేదు.
– మేకల చలం, విద్యానగర్, కరీంనగర్


