మాజీ స్పీకర్‌కు నివాళి | - | Sakshi
Sakshi News home page

మాజీ స్పీకర్‌కు నివాళి

Mar 3 2026 8:22 AM | Updated on Mar 3 2026 8:22 AM

కరీంనగర్‌అర్బన్‌/కరీంనగర్‌క్రైం: మాజీ స్పీకర్‌ దుద్దిళ్ళ శ్రీపాదరావు జయంతిని సోమవారం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్‌ ఆడిటోరియంలో శ్రీపాదరావు చిత్రపటానికి కలెక్టర్‌ చిత్రా మిశ్రా, అడిషనల్‌ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌, పలువురు అధికారులు నివాళి అర్పించారు. పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో శ్రీపాదరావు చిత్రపటానికి సీపీ గౌస్‌ ఆలం పూలమాల వేసి నివాళి అర్పించారు. ట్రైనీ ఐపీఎస్‌ సోహం సునీల్‌, అడిషనల్‌ డీసీపీ వెంకటరమణ, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ కిరణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

హోలీ శాంతియుతంగా జరుపుకోవాలి

కరీంనగర్‌క్రైం: రంగుల పండుగ హోలీ సోదరభావానికి ప్రతీక అని, ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సీపీ గౌస్‌ ఆలం విజ్ఞప్తి చేశారు. సహజసిద్ధమైన రంగులు వాడాలని, ఇతరుల అనుమతి లేకుండా వారిపై రంగులు చల్లడం నేరమన్నారు. మద్యం తాగి వాహనాలు నడపడం పూర్తిగా నిషేధమని, ట్రిపుల్‌ రైడింగ్‌, అతి వేగం, స్టంట్లు చేసేవారి వాహనాలను సీజ్‌ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. హోలీ సాకుతో ఈవ్‌జింగ్‌ లేదా మహిళలను వేధించే వారిపై నిఘా ఉంచేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని, అనుమతి లేకుండా డీజే సౌండ్‌ సిస్టమ్స్‌ వాడకూడదన్నారు. సోషల్‌ మీడియాలో పుకార్లు వ్యాప్తి చేసినా, మతపరమైన ఉద్రిక్తతలు పెంచే పోస్టులు పెట్టినా చట్ట ప్రకారం కఠిన శిక్షలు తప్పవని స్పష్టం చేశారు.

నేడు ఆలయాల మూసివేత

కరీంనగర్‌కల్చరల్‌: సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఉమ్మడి కరీంనగర్‌లోని దేవాదాయ, ధర్మాదాయశాఖ పరిధిలోని పలు ఆలయాలను మధ్యాహ్నం 3.20 నుంచి సాయంత్రం 6.47 గంటల వరకు మూసివేయనున్నట్లు ఉమ్మడి జిల్లా సహాయ కమిషనర్‌ సుప్రియ తెలిపారు. సాయంత్రం 7 గంటల తర్వాత ఆలయాల సంప్రోక్షణ తర్వాత పూజలు జరుగుతాయని, బుధవారం నుంచి భక్తుల ధర్శనాలకు అనుమతి ఇస్తామని పేర్కొన్నారు.

పత్తి మార్కెట్‌కు సెలవు

జమ్మికుంట: జమ్మికుంట మార్కెట్‌లో సోమవారం క్వింటాల్‌ పత్తి గరిష్ట ధర రూ.7,600 పలికింది. కాగా మంగళవారం హోలీ పండుగ సందర్భంగా మార్కెట్‌కు సెలవు ఉంటుందని, బుధవారం క్రయవిక్రయాలు జరుగుతాయని మార్కెట్‌ చైర్‌పర్సన్‌ పూల్లూరి స్వప్నసదానందం, ఇన్‌చార్జి కార్యదర్శి రాజా తెలిపారు.

విద్యుత్‌ వ్యవస్థ రక్షణకు ‘లైట్నింగ్‌ అరెస్టర్‌’

కొత్తపల్లి(కరీంనగర్‌): వర్షాకాలంలో మెరుపులు, పిడుగుల కారణంగా విద్యుత్‌ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్లకు నష్టం కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు టీజీఎన్‌పీడీసీఎల్‌ కరీంనగర్‌ ఎస్‌ఈ గంగాధర్‌ తెలిపారు. విద్యుత్‌ పంపిణీ వ్యవస్థను రక్షించేందుకు కీలక ప్రాంతాల్లో లైట్నింగ్‌ అరెస్టర్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 133 చోట్ల లైట్నింగ్‌ అరెస్టర్లు పెట్టామని, లైట్నింగ్‌ అరెస్టర్‌ అనేది మెరుపు, పిడుగు వల్ల ఉత్పన్నమయ్యే అధిక వోల్టేజ్‌ను భూమిలోకి సురక్షితంగా మళ్లించే రక్షణ పరికరం అని వివరించారు. మెరుపు కారణంగా కలిగే బ్రేక్‌డౌన్లు తగ్గే అవకాశం ఉందన్నారు. వినియోగదారులు వర్షాకాలంలో ఇంటి విద్యుత్‌ పరికరాలకు సర్జ్‌ ప్రొటెక్టర్లు వినియోగించడం, అనవసరంగా విద్యుత్‌ పరికరాలను తాకకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement