పారిశుధ్యంపై నిర్లక్ష్యం వహించొద్దు
కరీంనగర్ కార్పొరేషన్: పారిశుధ్య నిర్వహణలో ఎవరు నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని మేయర్ కొలగాని శ్రీనివాస్ హెచ్చరించారు. బుధవారం నగరపాలకసంస్థ కార్యాలయంలో కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్‌తో కలిసి పారిశుధ్య విభాగంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు, కార్మికులు సమయపాలన పాటిస్తూ, పారిశుధ్యాన్ని మెరుగుపరచాలన్నారు. ఉదయమే క్షేత్రస్థాయికి వెళ్లాలని, జవాన్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు పర్యవేక్షించాలని సూచించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చిన వెంటనే పరిష్కరించాలన్నారు. నగరవ్యాప్తంగా ట్రేడ్‌లైసెన్స్‌లు వందశాతం పూర్తి చేయాలని, ట్రేడ్‌లైసెన్స్ పన్నులు వసూలు చేయాలన్నారు. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలన్నారు. విలీన గ్రామాల పారిశుధ్యంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కమర్షియల్ ఏరియాల్లో చెత్త సేకరిస్తున్న ఏజెన్సీపై ఫిర్యాదులు వస్తున్నాయని అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. 2026 స్వచ్ఛ సర్వేక్షన్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నగర కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ మాట్లాడుతూ సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్ ఓపెన్ స్థలాల్లో వ్యర్థాలు వదలకుండా పర్యవేక్షణ చేయాలన్నారు. వ్యర్థాలు ఓపెన్ స్థలాల్లో వేస్తే కేసులు నమోదు చేయ్యాలని ఆదేశించారు. డంపు యార్డులో జరుగుతున్న బయోమైనింగ్ ప్రక్రియను పర్యవేక్షించాలన్నారు. సహాయ కమిషనర్ దిలీప్ కుమార్, ఎంహెచ్‌వో సుమన్ పాల్గొన్నారు.


