లక్ష్యానికి చేరువలో రుణాల పంపిణీ
కరీంనగర్ అర్బన్: రుణాల పంపిణీని సకాలంలో పూర్తి చేయాలని, లక్ష్యానికి చేరువలో ఉన్నామని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని కేడీసీసీబీ సమావేశమందిరంలో డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ సమీక్ష నిర్వహించారు. రైతులకు రుణాల పంపిణీ, స్వయం సహాయక సంఘాలకు రుణాలు, రికవరీ, పీఎంజీపీవై రుణాలు, ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ పథకాల నిర్వహణపై ఆరా తీశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 84.55శాతం రుణాలు పంపిణీ చేసినందుకు బ్యాంకర్లను అభినందించారు. ఏప్రిల్ 2025 నుంచి డిసెంబర్ 2025 వరకు రూ.11,358.47 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.4665.81కోట్లు, ఎంఎస్‌ఎంఈ రంగంలో రూ.2329.25 కోట్లు, విద్యా రుణాలకు రూ.14.52కోట్లు, హౌసింగ్ రుణాలు రూ.161.52కోట్లు, ఎస్‌హెచ్‌జీ గ్రూప్‌లోన్లు రూ.918.38కోట్లు, ఇతర రంగాలకు సంబంధించి రూ.3268.99 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. అర్హులైన రైతులందరికీ రుణాలు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి స్వానిధి కింద మొదటి, రెండు, మూడో దరఖాస్తులను, పీఎంఈజీపీ, పీఎం విశ్వకర్మ యోజన పథకం దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని బ్యాంకర్లకి సూచించారు. మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఎల్డిఎం ఆంజనేయులు, ఆర్బీఐ ఎల్‌డీవో యశ్వంత్, డీడీఎం జయప్రకాశ్, ఎస్బీఐ ఏజీఎం వెంకటేశ్, కెడీసీసీబీ సీఈవో సత్యనారాయణరావు పాల్గొన్నారు.


