జాతీయస్థాయి చెకుముకి పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు
కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ–టెక్నో స్కూల్ విద్యార్థులు కరీంనగర్ పద్మనగర్‌లోని ఓ పాఠశాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి చెక్‌ముకి పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు విద్యాసంస్థల చైర్మన్ డా.వి.నరేందర్‌రెడ్డి తెలిపారు. జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో పాఠశాలకు చెందిన కే ఓం కార్తికేయ (10వ తరగతి), ఎస్.రీషాల్ (9వ తరగతి), ఓ.శివస్మరణ్‌రెడ్డి (8వ తరగతి) రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానాన్ని కై వసం చేసుకున్నారు. సోమవారం విద్యార్థులకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. జాతీయస్థాయిలో సత్తాచాటాలని ఆకాంక్షించారు. పాఠశాలలో నిపుణులైన వైజ్ఞానిక శాస్త్ర ఉపాధ్యాయులచే విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తూ వివిధ స్థాయిలో నిర్వహించే పోటీలకు ఎంపిక చేస్తున్నామని తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


