సమస్యల పరంపర.. అర్జీల జాతర
కరీంనగర్ అర్బన్: ‘ప్రజావాణి’ జన జాతరను మరిపించింది. ఎన్నికల కోడ్ కారణంగా కొద్దిరోజులుగా కార్యక్రమం లేకపోగా సోమవారం ప్రారంభించిన విషయం విదితమే. జిల్లా నలుమూలల నుంచి జనం తండోపతండాలుగా తరలివచ్చారు. అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్, నగరపాలక కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డీఆర్వో వెంకటేశ్వర్లు దరఖాస్తులు స్వీకరించారు. 379 మంది తమ సమస్యలు విన్నవించారని కలెక్టరేట్ ఏవో సుధాకర్ వివరించారు. ఇన్నాళ్లు ప్రజలు ఉన్నతాధికారులను కలిసే అవకాశం లేకపోవడమే అర్జీలు పెరగడానికి కారణమని స్పష్టమవుతోంది. మండల అధికారుల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణలోపం వెరసి సమస్యలు పేరుకుపోయాయి. ప్రజావాణి ఎపుడెపుడు ప్రారంభమవుతుందని నిరీక్షించిన ప్రజలు ఇక కలెక్టరేట్ బాట పడుతున్నారు. ప్రధానంగా భూ సమస్యలు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లకు అర్జీలు అందజేశారు.
మొత్తం అర్జీలు: 379
మున్సిపల్ కార్పొరేషన్: 74
హౌసింగ్: 67, ఆర్డీవో కరీంనగర్: 18
శంకరపట్నం తహసీల్దార్: 13
తిమ్మాపూర్ తహసీల్దార్: 12


