తాళం వేస్తే టార్గెట్
పల్లెల్లో పెరిగిపోయిన చోరీలు మూలనపడ్డ సీసీ కెమెరాలు వలస కార్మికులపైనే అనుమానాలు వేలిముద్రలు సేకరిస్తున్న పోలీసులు
నిఘా తీవ్రం చేశాం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): తాళం వేసి ఊరెళ్లుతున్నారా.. అయితే మీ ఇల్లు దొంగలకు టార్గెట్ కానుంది. తిరిగొచ్చే సరికి ఇల్లు గుల్ల కావడం ఖాయం. ఇటీవల జిల్లాలో జరిగిన దొంగతనాలను పరిశీలిస్తే తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గ్రామాల్లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో దొంగల ఆచూకీ దొరకడం లేదు.
వరుస సంఘటనలు
ఎల్లారెడ్డిపేట మండలంలో నెల రోజుల వ్యవధిలో నాలుగు దొంగతనాలు జరిగాయి. వరుస దొంగతనాలతో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోతుంది. తాజాగా రాచర్లగొల్లపల్లిలోని తాళం వేసిన ఉన్న రెండు ఇళ్లలోకి ప్రవేశించి నగదు, బంగారు నగలు ఎత్తుకెళ్లారు. అంతకుముందు అల్మాస్‌పూర్‌లో మూడు ఇళ్లల్లో దొంగతనం చేశారు.
పనిచేయని సీసీ కెమెరాలు
జిల్లా వ్యాప్తంగా 257 గ్రామపంచాయతీలకు దాదాపు 65 శాతం గ్రామాల్లో స్థానికులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నిర్వహణపై పట్టింపు లేక సగానికి పైగా సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. జిల్లాలో 1,225కు పైగా సీసీ కెమెరాలను గతంలో ఏర్పాటు చేశారు. అయితే ఇందులో వెయ్యికి పైగా సీసీ కెమెరాలు పనిచేయడం లేదని అధికారులు చెబుతున్నారు. కొత్తగా ఎన్నికై న గ్రామపంచాయతీల పాలకవర్గాలు సీసీ కెమెరాల నిర్వహణపై దృష్టి పెట్టాలని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు.
వేలిముద్రల సేకరణలో పోలీసులు
జిల్లాకు ఇతర ప్రాంతాల నుంచి వలస కార్మికుల రాక పెరిగింది. జిల్లాలో భవన నిర్మాణాల పనులు ముమ్మరం కావడం, వ్యవసాయ పనులు ఊపందుకోవడం, కోళ్లషెడ్లలో పనిచేసేందుకు బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ నుంచి కార్మికులు వస్తున్నారు. వరుసగా దొంగతనాలు జరుగుతుండడంతో అపరిచిత వ్యక్తుల సంచారం పెరగడంతో వారిపై పోలీసులు నిఘా పెట్టారు. అంతేకాకుండా గత పదిహేను రోజులుగా జిల్లాలో జరుగుతున్న దొంగతనాల నేపథ్యంలో వలసకూలీల వివరాలు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో వలసకూలీల వివరాలతో కూడిన జాబితాను తయారు చేయడమే కాకుండా వేలిముద్రలు సేకరిస్తున్నారు. దొంగతనాలు జరిగిన సందర్భాల్లో వలసకార్మికుల వేలిముద్రలతో పోల్చి నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు.
ఇది ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లిలోని వేముల కల్యాణి ఇంట్లోని బీరువా పరిస్థితి. ఈనెల 7న దొంగలు పడి బీరువాలోని విలువైన వస్తువులు, రూ.15వేల నగదు ఎత్తుకెళ్లారు. గ్రామంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో దొంగల సమాచారం దొరకడం లేదు. 25 రోజులు గడుస్తున్నా దొంగల ఆచూకీ తెలియడం లేదు. ఇలా మండలంలో నెల రోజుల వ్యవధిలో నాలుగు దొంగతనాలు జరిగాయి.
దొంగతనాల నేపథ్యంలో నిఘా తీవ్రం చేశాం. రాచర్లగొల్లపల్లిలో రెండు ఇండ్లల్లో జరిగిన దొంగతనంపై విచారణలో భాగంగా పలువురి వేలిముద్రలు సేకరించాం. పలు ఆలయాల్లో చోరీలకు పాల్పడిన దొంగలను పట్టుకున్నాం. గ్రామాల్లో సీసీ కెమెరాలు పనిచేయక నిందితులు సులభంగా తప్పించుకోగలుగుతున్నారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. అపరిచిత వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
– రాహుల్‌రెడ్డి, ఎల్లారెడ్డిపేట ఎస్సై
తాళం వేస్తే టార్గెట్


