ప్రాణం తీసిన భూపంచాయితీ
● కనగర్తిలో ఒకరు మృతి
ఓదెల(పెద్దపల్లి): భూ పంచాయితీ ఓ రైతు ప్రాణం తీసింది. ఈఘటన పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. కనగర్తి గ్రామానికి చెందిన ఆది రాజయ్య(సన్నాఫ్ మల్లయ్య)ను ఇదే గ్రామానికి చెందిన ఆది రాజయ్య(సన్నాఫ్ ఐలయ్య) పొలం వద్ద పిడిగుద్దులు గుద్ది, కాళ్లతో తన్ని బురదలో తొక్కి చంపేశాడు. పొత్కపల్లి ఎస్సై రమేశ్, మృతుడి కూతురు వొడ్నాల లావణ్య కథనం ప్రకారం.. కనగర్తిలో ఒంటరిగా ఉంటున్న రాజయ్య వ్యవసాయం చేస్తూ బతుకుతున్నాడు. ఇదే గ్రామానికి చెందిన ఆది రాజయ్య భూమి ఆయన పొలాన్ని ఆనుకొని ఉంది. ఇద్దరి భూముల మధ్య గెట్టు(ఒడ్డు) విషయంలో పలుమార్లు గొడవలు, కులపెద్ద మనుషుల సమక్షంలోనూ పంచాయతీలు జరిగాయి. సోమవారం ఉదయం ఆది రాజయ్య(సన్నాఫ్ మల్లయ్య) కూలీలతో పొలంలో పనులు చేయిస్తున్నాడు. ఈక్రమంలో ఒడ్డు వద్దగల హద్దు రాయిని రాజయ్య(సన్నాఫ్ ఐలయ్య) పీకేశాడు. దానిని ఎందుకు పీకేశావని ఆదిరాజయ్య(సన్నాఫ్ మల్లయ్య) అడిగాడు. దీంతో ఆదిరాజయ్య(సన్నాఫ్ మల్లయ్య) చేతులతో పిడిగుద్దులు గుద్దాడు. కాళ్లతో తన్ని బురదలో తొక్కాడు. దీంతో బురదలో బొర్లపడి ముక్కు మూసుకుపోయి ఊపిరి ఆడక ఆది రాజయ్య(సన్నాఫ్ ఐలయ్య) అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కూతురు వొడ్నాల లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పెద్దపల్లి సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఘటనా స్థలాన్ని పెద్దపల్లి డీసీపీ భూక్యా రాంరెడ్డి, ఏసీపీ కృష్ణ, పొత్కపల్లి, సుల్తానాబాద్ ఎస్సైలు రమేశ్, చంద్రకుమార్ పరిశీలించారు. పాత గొడవలను దృష్టిలో పెట్టుకుని తన తండ్రిని చంపేశారని మృతుడి కుతుళ్లు బోరున విలపించారు. వరి నాట్ల సమయంలో రైతు మృతి చెందడంతో గ్రామంలో విషాదం అలముకుంది. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.


