గంజాయి సరఫరా.. కాపర్ చోరీ
చొప్పదండి: పట్టణంలోని గుమ్లాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద సోమవారం వాహనాల తనిఖీ చేస్తున్న పోలీసులకు ఇద్దరు గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డారు. వీరు ట్రాన్స్‌ఫార్మర్‌లను పగులగొట్టి కాపర్ వైరు చోరీ చేసేవారని విచారణలో తేలింది. కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్‌కుమార్ చొప్పదండి పోలీస్ స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. ఎస్సై నరేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేస్తుండగా 1.150 కిలోల గంజాయితో చొప్పదండి మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన గోగులకొండ మహేశ్, చొప్పదండికి చెందిన రాంటెంకి శివప్రసాద్ పట్టుబడ్డారు. వీరిని పోలీసులు తమదైన శైలిలో విచారించగా జూలపల్లికి చెందిన నెరుమట్ల అజయ్‌తో కలిసి మహారాష్ట్రలోని చంద్రాపూర్ నుంచి గంజాయి తీసుకువచ్చి చొప్పదండి ప్రాంతంలో విక్రయిస్తున్నట్లు తేలింది. జిల్లాలోని చొప్పదండి, కరీంనగర్‌రూరల్, తిమ్మాపూర్, రామడుగు, గంగాధర పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో ట్రాన్స్‌ఫార్మర్‌లను చోరీ చేస్తూ, వాటి లోని కాపర్‌ను చొప్పదండిలోని స్క్రాప్ రిసీవర్ యజమాని మల్లేశంకు విక్రయించారు. కరీంనగర్ టూటౌన్ పరిధి శర్మనగర్‌లో బైక్ చోరీ చేసి ఆర్నకొండకు చెందిన శేఖర్‌కు అమ్మినట్లు ఒప్పుకోగా బైక్, గంజాయి 12.58 కిలోల కాపర్‌ను రికవరీ చేశారు. రాంటెంకి శివప్రసాద్‌పై వేములవాడ పోలీస్‌స్టేషన్ పరిధిలో బైక్ చోరీ, హౌస్ బ్రేకింగ్ కేసు, చొప్పదండి పరిధిలో కాపర్ చోరీ, మహేశ్‌పై కాపర్ చోరీ కేసులు ఉన్నాయని తెలిపారు. పరారీలో ఉన్న అజయ్‌పై వివిధ పోలీస్‌స్టేషన్‌లలో కేసులు ఉన్నట్లు తెలిసిందన్నారు. కేసు ఛేదనలో కృషి చేసిన సీఐ ప్రదీప్‌కుమార్, ఎస్సై, కానిస్టేబుళ్లను అభినందించారు. కాగా నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ఇళ్లలోనే జరుపుకోవాలని, రోడ్లపైకి వచ్చి యువకులు ఎలాంటి ఆటంకాలు సృష్టించవద్దని కోరారు.
ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు


