చలాన్ల దూకుడు పార్ట్–2
3 లక్షలు దాటేలా ఉన్న చలానాలు..
సాక్షిప్రతినిధి,కరీంనగర్ ●:
కరీంనగర్ కమిషనరేట్‌లో ట్రాఫిక్ చలాన్ల విషయంలో పోలీసుల దూకుడు తగ్గడం లేదు. ప్రజలకు అవగాహన కల్పించాల్సింది పోయి చలాన్ల విషయంలో తగ్గేదే లే అన్న తరహాలో దూసుకెళ్తున్నారు. 70కిపైగా ఉల్లంఘనల పేరిట ఎడాపెడా జరిమానాలు విధిస్తున్నారు. ‘ఎందుకు జరిమానా వేస్తున్నారు’? అని అడిగినందుకు కూడా వాదనకు దిగారంటూ రెండు రకాలుగా చలాన్ వేస్తున్నారు. జరిమానే లక్ష్యంగా పెట్టుకోవడంపై జనాలు మండిపడుతున్నారు. కరీంనగర్ చుట్టు పక్కల నుంచి నగరానికి రోజూ వేలాది వాహనాలు వస్తుంటాయి. వారిలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన డ్రైవర్లుంటారు. నగరంలో కొంతకాలం పాటు ముందస్తుగా ట్రాఫిక్ ఉల్లంఘనలపై ప్రచారం నిర్వహించి, ఆపై చలాన్లు వేస్తే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. 2023లో రూ.6 కోట్లు, 2024లో రూ.7 కోట్లు, 2025లో రూ.13.5 కోట్లు జరిమానాలు విధించడం నగర ట్రాఫిక్ పోలీసుల దూకుడు నిదర్శనం.
రోడ్లను వారికిచ్చేశారా?
పోలీసులు ప్రజల విషయంలో ఒకరకంగా వ్యాపార సముదాయాల విషయంలో మరోరకంగా వ్యవహరించడంపై సామాన్యులు మండిపడుతున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనల విషయంలో ఎడాపెడా చలాన్లు రాసే పోలీసులు నగరం నడిబొడ్డున రోడ్డును ఓ ప్రైవేటు సంస్థ పార్కింగ్ కోసం కేటాయించేందుకు బారికేడ్లు పెడుతుండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గీతాభవన్ చౌరస్తా నుంచి సెవెన్‌హిల్స్ వెళ్లే దారిలో ఓ నగల దుకాణం ఉంది. సాయంత్రం వేళ రద్దీ సమయంలో దుకాణానికి వచ్చే వాహనాల పార్కింగ్ కోసం ప్రజలను దారి మళ్లిస్తున్నారు. ఇదేంటని అడిగినా స్పందించే పోలీసులు లేరు. టవర్ సర్కిల్ సమీపంలో రాజు టీ స్టాల్ వైపు ప్రతీరోజూ ట్రాఫిక్ జామవుతోంది. అయినా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడరు. కమిషనరేట్‌ను ఆనుకుని ఓ కేఫ్‌కు పోలీసులు అనుమతించారు. ఈ కేఫ్‌కు వచ్చేవారు రోడ్డుకు అడ్డంగా వాహనాలు పార్క్ చేస్తున్నారు. ఇవేమీ పోలీసుల కళ్లకు కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. సామాన్యులపై జరిమానాలతో ప్రతాపం చూపడం ఏంటని ఆగ్రహిస్తున్నారు. ప్రజల డబ్బులతో నిర్మించిన రోడ్లను ప్రైవేటు వాణిజ్య సముదాయాలకు ఎందుకు అప్పగిస్తున్నారో పోలీసులకే తెలియాలని వ్యాఖ్యానిస్తున్నారు.
2023 మొత్తం ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ చలాన్లపై పెద్దగా దృష్టి సారించలేదు. ఆ ఏడాది మొత్తం మీద 3 లక్షల వరకు చలాన్లు నమోదవగా కేవలం రూ.6.79 కోట్ల జరిమానాలు విధించారు. 2024లో 2.83 లక్షల చలాన్లకు రూ.7.52 కోట్ల జరిమానా వేశారు. 2025లో జనవరి నుంచి అక్టోబరు నెలాఖరు వరకు 2.61లక్షల చలాన్లకు రూ.13.58 కోట్ల ఫైన్లు పడ్డాయి. ఈ సగటు లెక్కన చూస్తే.. డిసెంబరు నెలాఖరు నాటికి మరో 52వేలకుపైగా చలాన్లు కలుపుకుంటే ఈ–చలాన్లు 3లక్షలు దాటుతున్నాయి. 2024లో రోజుకు 777 చొప్పున చలాన్లు జనరేట్ అయ్యాయి. 2025లో పది నెలల కాలంలో రోజుకు 858 చొప్పున చలాన్లు వేశారు. అంటే గంటకు 36. ఇంకా చెప్పాలంటే రెండు నిమిషాలకు ఒక చలాన్ చొప్పున వేస్తున్నారు. ఇందుకోసం ట్రాఫిక్ విభాగంలో అదనపు సిబ్బందిని నియమించుకుని, టార్గెట్లు పెట్టి మరీ ఫైన్లు వేయడంపై జనాలు మండిపడుతున్నారు.


