పిల్లలు బడికి.. పెద్దలు పనికి
కరీంనగర్‌టౌన్: బడీడు పిల్లలు పనిలో కాదు పాఠశాలలో ఉండాలనే ఉద్దేశంతో విద్యాశాఖ గురువారం నుంచి బడిబయట పిల్లల గుర్తింపు సర్వే ప్రారంభించింది. చదువు మధ్యలో ఆపినవారితో పాటు ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చినవారి పిల్లలను బడిలో చేర్పించేందుకు క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు సర్వే నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 15 మండలాలతో పాటు అర్బన్ పరిధిలో 315 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 651 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. 80 మంది సీఆర్పీలు పిల్లల గుర్తింపు సర్వే చేపట్టారు. ఈ సర్వే డిసెంబర్ 31 వరకు 42 రోజులపాటు కొనసాగనున్నాయి.
సీఆర్పీలకు అవగాహన
బడి బయట పిల్లల సర్వే పకడ్బందీగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఇటీవల జూమ్ వేదికగా జిల్లాశాఖ అధికారులు సీఆర్పీలకు అవగాహన కల్పించారు. అధికారులు సర్వేలో ఎలా పాల్గొనాలని, విద్యార్థుల సమాచారం ఎలా రాబట్టాలి. బడి మానేసిన కారణాలు. విద్యార్థులకు ఎదురవుతున్న సమస్యలు.. తల్లిదండ్రుల సమస్యలు ఎలా తెలుసుకోవాలనే వాటిపై అవగాహన కల్పించారు. వరుసగా 30రోజులు హాజరుకాని విద్యార్థులను గుర్తించి తిరిగి బడికి వచ్చేలా ప్రణాళికలు రూపొందించనున్నారు. గతేడాది జిల్లాలో 6 నుంచి 14 ఏళ్లలోపు 125మందిని, 15 నుంచి 19 ఏళ్ల లోపు 158మందిని, ఇతర ప్రాంతాల నుంచి వలసవచ్చిన వారు 448 మంది విద్యార్థులు మొత్తం 731 మందిని గుర్తించారు.
తొలి రోజు 62 మంది గుర్తింపు
జిల్లా వ్యాప్తంగా గురువారం బడిబయట పిల్లల గుర్తింపు సర్వే ప్రారంభమైంది. 15 మండలాల్లో 80మంది సీఆర్పీలు సర్వే చేపట్టగా పలువురు విద్యార్థుల వివరాలను సేకరించారు. డ్రాప్ అవుట్ అయిన విద్యార్థులతో పాటు ఇటుక బట్టీలలో ఉన్న విద్యార్థులను గుర్తించారు. తొలి రోజున మొత్తం 62 మంది విద్యార్థుల వివరాలను సీఆర్పీలు సేకరించారు. ‘బడి బయట పిల్లలను గుర్తించే ప్రక్రియ 42 రోజుల పాటు పకడ్బందీగా జరగనుంది. డ్రాప్ అవుట్ పిల్లలను గుర్తించి, సౌకర్యాలు కల్పించే దిశగా ప్రభుత్వం ఉంది’. అని సమగ్ర శిక్ష జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ కర్ర అశోక్ రెడ్డి తెలిపారు.


