బీజేపీలో విభేదాల్లేవు
కరీంనగర్/జమ్మికుంట: బీజేపీలో ఎలాంటి విభేదాల్లేవని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. గురువారం కరీంనగర్‌కు వచ్చిన రాజేందర్ ఇటీవల మృతి చెందిన టీడీపీ నేత కల్యాడపు ఆగయ్య, ఏఐఎఫ్‌బీ నేత బండ సురెందర్‌రెడ్డి కుటుంబాలతో పాటు మాజీ కార్పొరేటర్ బోయినపల్లి శ్రీనివాస్ తల్లి మృతిచెందగా ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరిని కలిసి భరోసా ఇచ్చారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ నివాసంలో మాట్లాడుతూ.. బీజేపీలో విభేదాలు సోషల్‌మీడియా సృష్టేనంటూ కొట్టిపడేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరం కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. హుజురాబాద్‌లో జరిగిన సమావేశానికి తనకు సమాచారం ఉన్నప్పటికీ వ్యక్తిగత కారణాలతో హాజరుకాలేకపోయానని తెలిపారు. అనంతరం జమ్మికుంటలో పర్యటించారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్‌రావు నివాసంలో మాట్లాడుతూ.. హుజూరాబాద్ నియోజకవర్గంతో 25 ఏళ్ల అనుబంధం ఉందని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్థానిక ఎన్నికల్లో ఎక్కువ మందిని గెలిపించడానికి బీజేపీ నాయకుడిగా తనవంతు ప్రయత్నం చేస్తున్నానని స్పష్టం చేశారు. పత్తి కొనుగోళ్లపై కేంద్రంతో మాట్లాడుతున్నామని, రాష్ట్ర ప్రభుత్వం నాన్చుడు ధోరణి సరికాదన్నారు. వర్షాలకు నష్టపోయిన రైతులకు రూ.10వేలు ఇవ్వాలన్నారు. సన్నవడ్లకు బోనస్ ఇవ్వాలని, పూర్తిగా రూ.2లక్షల రుణమాఫీ చేయాలన్నారు. మాజీ జెడ్పీటీసీ శ్రీరామ్‌శ్యామ్, మాడా గౌతంరెడ్డి, జీడీ మల్లేశ్, శ్రీలం శ్రీనివాస్, సురేందర్‌రాజు పాల్గొన్నారు.


