● కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్‌కల్చరల్: వయోవృద్ధుల పోషణ, సంరక్షణ చట్టాన్ని అనుసరించి ట్రిబ్యునల్ ఉత్తర్వులను పాటిస్తోందని, లేనిది పర్యవేక్షించాలని, తద్వారా వృద్ధులు, తల్లిదండ్రులకు న్యాయం చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. వయోవృద్ధులు, తల్లిదండ్రుల పోషణ, సంక్షేమ చట్టం 2007 అమలు తీరు, ట్రిబ్యునల్ ఉత్తర్వులు, అమలుపై వృద్ధుల సంక్షేమ కమిటీ సభ్యులు, అధికారులు, సీపీ గౌస్ ఆలంతో కలిసి కలెక్టరేట్‌లో సమావేశం అయ్యారు. తల్లిదండ్రుల బాగోగులు చూడడం లేదని, శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారని, బలవంతంగా ఆస్తిపత్రాలపై సంతకాలు చేయించుకుంటున్నారని రెవెన్యూ డివిజనల్ అధికారి ట్రిబ్యునల్‌కు చాలా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ట్రిబ్యునల్ తీర్పులను పలువురు బేఖాతరు చేస్తున్నారన్నారు. దీంతో సదరు వృద్ధులు కలెక్టర్, ఆర్డీవో కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు. వయోవృద్ధుల కేసులకు సంబంధించి ప్రతీ శనివారం నిర్వహించే విచారణలో ఒక పోలీస్ అధికారికి విధులు కేటాయించాలని సీపీకి సూచించారు. ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్‌బాబు, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్, డీసీహెచ్‌ఎస్ కృష్ణప్రసాద్ ఉన్నారు.