
వృద్ధులకు భరోసా.. బాలికలకు భవిత
కరీంనగర్ అర్బన్: స్వయం సహాయక సంఘాల బలోపేతంతో మహిళలకు ఆర్థిక తోడ్పాటును అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఇందిరా మహిళా శక్తి’ పథకాన్ని అమలు చేస్తోంది. ఎక్కడా సభ్యత్వం లేని మహిళలు, కౌమార బాలికలు, వృద్ధులతో కొత్త సంఘాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే కార్యాచరణ మొదలవగా ఈ నెలాఖరు వరకు కొనసాగించనున్నారు.
వేర్వేరుగా సంఘాల ఏర్పాటు
అరవై ఏళ్లు దాటిన వృద్ధులను గ్రామ సమాఖ్యల ఆధ్వర్యంలోని సంఘాల నిర్వాహకులు వయసు రీత్యా సభ్యత్వం నుంచి పక్కన పెడుతున్నారు. ప్రస్తుత కార్యాచరణలో భాగంగా అలా తొలగించిన వారిని గుర్తించి ప్రత్యేక సంఘాలు ఏర్పాటు చేస్తారు. వారికి చిరువ్యాపారాలు, ఇతర మార్గాల్లో ఆర్థిక ఊతమిస్తారన్న మాట. 15 నుంచి 18 ఏళ్ల కిశోర బాలికలతో సంఘాలను ఏర్పాటు చేసి పొదుపు ప్రాధాన్యంపై అవగాహన కల్పిస్తారు. దీంతో ఆర్థిక లావాదేవీల గురించి తెలిసొస్తుంది. విద్య ప్రాధాన్యం, ఉద్యోగావకాశాల గురించి సమావేశాల్లో వివరిస్తారు. సమాజంలో వేధింపులు, సామాజిక మాధ్యమాల మోసాలు, అత్యాచారాలు, ఇతర మహిళా వ్యతిరేక నేరాల నియంత్రణపై చైతన్యపరుస్తున్నారు. దివ్యాంగుల సంఘాలు ఇప్పటికే కొనసాగుతుండగా ఇంకా ఎక్కడైనా ఒకే ప్రాంతంలో 12 మంది ఉంటే కొత్తగా సభ్యత్వం కల్పిస్తారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు వీటి వేదికగా అందేలా చూస్తారు. బ్యాంక్ లింకేజీ రుణాలిచ్చి వర్గాల వారు సంఘాల ఏర్పాటుకు ముందుకొచ్చేలా చూడాలని సెర్ఫ్ సిబ్బంది, మండల సమాఖ్యల బాధ్యులను ఉన్నతాధికారులు ఆదేశించారు.
ప్రత్యేక కార్యాచరణతో ప్రక్రియ
గ్రామాల్లో ఏ సంఘాల్లో లేని మహిళలు, దివ్యాంగులు, కౌమార బాలికలను డీపీఎంలు, సీసీలు, ఇతర సిబ్బంది ఆధ్వర్యంలో గుర్తిస్తున్నారు. గ్రామాల వారీ జాబితాను రూపొందిస్తున్నారు. కొత్త సంఘాల్లో చేరితే కలిగే ప్రయోజనాల గురించి వివరించేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత సంఘాల ఆర్థిక విజయాలు చెప్పడమే కాకుండా, ఆయా సభ్యుల అనుభవాలను, నిబంధనలను పరిచయం చేస్తారు. ఈ నెల 15 నుంచి 30వరకు ముందుకు వచ్చే సభ్యులతో సంఘాలను ఏర్పాటు చేసి, వారితో బ్యాంకుల్లో పొదుపు ఖాతాలు తెరిపిస్తారు. వివరాలు ‘సెర్ప్’ వెబ్‌సైట్‌లో నమోదు చేయిస్తారు. కాగా ప్రభుత్వ ఆదేశాల మేరకు లక్షిత వర్గాల మహిళలతో సంఘాలు ఏర్పాటు చేయిస్తున్నామని, బ్యాంక్ లింకేజీ, సీ్త్రనిధి రుణాల మంజూరు చేయిస్తామని డీఆర్డీవో వర్గాలు తెలిపాయి.