
గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లు
కొత్తపల్లి(కరీంనగర్)/మానకొండూర్: గణేశ్ నిమజ్జనోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. నీటిపారుదల, విద్యుత్, అగ్నిమాపక, పోలీసు, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిమజ్జనానికి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. మానకొండూర్, కొత్తపల్లి చెరువులు, చింతకుంట ఎస్సారెస్పీ కాలువ వద్ద నిమజ్జన కేంద్రాలను మంగళవారం సీపీ గౌస్ ఆలం, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డితో కలిసి సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీన నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నిమజ్జన ప్రాంతాల్లో భారీకేడ్లు, తగిన సామర్థ్యంతో ఉన్న క్రేన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. చెరువులో బోట్లు, ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలన్నారు. సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ గణేశ్ నిమజ్జ్జనం నేపథ్యంలో నగరంలో, నిమజ్జన ప్రాంతాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా దారి మళ్లింపు, వన్‌వే చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్డీవో కుందారపు మహేశ్వర్, ఏసీపీ విజయ్‌కుమార్, కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు పాల్గొన్నారు.
భూ సేకరణ సమస్యలు పరిష్కరించండి
కరీంనగర్ అర్బన్: జిల్లా మీదుగా వెళ్తున్న జాతీయ రహదారి 563 నిర్మాణానికి భూసేకరణ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. భూ సేకరణ సమస్యలపై మంగళవారం కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. భూములు కోల్పోయిన వారికి అందిన పరిహారం, మార్కెట్ రేటు, భూమి అప్పగించకపోవడానికి కారణాలను తెలుసుకున్నారు. సేకరణ విషయంలో అభ్యంతరాలు ఉన్నవారితో మాట్లాడి భూ సేకరణకు సహకరించేలా చూడాలని అన్నారు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మికిరణ్, జాతీయ రహదారి సంస్థ ప్రాంతీయ అధికారి శివశంకర్, వరంగల్ ప్రాజెక్ట్ సంచాలకుడు నాగరాజు, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్‌బాబు పాల్గొన్నారు.
మానేరు రివర్ ఫ్రంట్ భూసేకరణ వేగవంతం చేయాలి
మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణంలో భాగంగా నదికి ఇరువైపులా ఉన్న ప్రైవేటు వ్యక్తుల నుంచి భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ భూముల సర్వేనంబర్లు, భూ సేకరణ విస్తీర్ణం తదితర అంశాలపై ఇరిగేషన్ రెవెన్యూ, అధికారులతో చర్చించారు. మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కిరణ్ ప్రకాశ్, ఇరిగేషన్ డీఈలు వేణుగోపాల్, సంతోష్ పాల్గొన్నారు.