
స్థానిక సంస్థల్లో గెలుపే లక్ష్యంగా..
కరీంనగర్‌టౌన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ మే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు బుధవారం కరీంనగర్ పర్యటనకు రానున్నారు. రాష్ట్ర అధ్యక్షహోదాలో తొలిసారి కరీంనగర్ రానుండటంతో పార్టీ శ్రేణులు భారీ స్వాగతానికి ఏర్పాట్లు చేశారు. ఉదయం 10:30కు గుండ్లపల్లి టోల్‌గేట్ వద్ద కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమార్‌తో పాటు వందలాది మంది కార్యకర్తలు ఘన స్వాగతం పలకనున్నారు. మధ్యాహ్నం 12గంటలకు కరీంనగర్‌లోని కొండా సత్యలక్ష్మీ గార్డెన్‌లో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని బూత్ అధ్యక్షులు, కార్యదర్శులు, జిల్లాస్థాయి నాయకులతో ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై రామచంద్రరావు, బండి సంజయ్ దిశానిర్దేశం చేయనున్నారు. గత ఆరేళ్లలో కరీంనగర్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.20,000 కోట్లకు పైగా నిధులు, బండి సంజయ్ చొరవతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యచరణ రూపొందించారు. ప్రత్యేకంగా 10వ తరగతి విద్యార్థులకు ఉచిత సైకిళ్లు, శాతవాహన యూనివర్శిటీకి 12బీ హోదా, కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ, సైనిక్ స్కూల్, ఆర్వోబీలు వంటి పలు మేజర్ ప్రాజెక్టుల వివరాలను గ్రామస్థాయిలో ప్రచారం చేసేలా వ్యూహరచన చేయనున్నారు.