ఇష్టారాజ్యం! | - | Sakshi
Sakshi News home page

ఇష్టారాజ్యం!

Sep 3 2025 4:55 AM | Updated on Sep 3 2025 12:12 PM

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లాలోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో సీట్ల వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అడ్మిషన్ల షెడ్యూల్‌ వెలువడక ముందే కొన్ని కళాశాలలు సీట్లు అమ్ముకుంటున్న విషయం వెలుగుచూసింది. ఈ వ్యవహారంపై ఉన్నత విద్యామండలికి వరుస ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో సదరు కళాశాలలు అనుసరిస్తున్న అక్రమ విధానాలపై ఉన్నత విద్యామండలి అధికారులు ఫోకస్‌ పెట్టారని సమాచారం. ముందస్తు అడ్మిషన్ల విషయంలో కొన్ని కళాశాలలు అనుసరిస్తున్న అక్రమ వ్యవహారాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు.

అసలేం జరిగింది?

ఉన్నత విద్యకు కరీంనగర్‌ కేంద్రబిందువు. తిమ్మాపూర్‌ శివారులో మూడు ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి. రెండు కళాశాలల నిర్వాహకులు తెలంగాణ ఇంజినీరింగ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్టు (టీజీఈఏపీసీఈటీ) నుంచి షెడ్యూలు వెలువడకముందే సీట్లను విక్రయించుకున్నారు. ఈ వ్యవహారం సాఫీగా నడిచేందుకు ప్రత్యేకంగా కొందరు పీఆర్వోలను కమీషన్‌ పద్ధతిన నియమించుకున్నారు. వీరు జూన్‌కు ముందే విద్యార్థులను వెతికి పట్టుకువచ్చారు. తెలంగాణ ఇంజినీరింగ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్టు (టీజీఈఏపీసీఈటీ) షెడ్యూల్‌ ప్రకారం.. జూన్‌ 28 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కావాలి. శివారులోని రెండు కళాశాలలు జూన్‌28కి ముందు.. అంటే జూన్‌ 23నే ఇంజినీరింగ్‌ (ఈఈఈ) మేనేజ్‌మెంట్‌ కోటా సీటు కోసం రూ.10వేలు వసూలు చేశాయి. ఆ కళాశాల సమీపంలోనే మరో కళాశాల అదే ఇంజినీరింగ్‌ (ఈఈఈ) సీటు కోసం ఏకంగా జూన్‌ 23వ తేదీన రూ.45,000కు అలాట్‌ చేసింది. ఇప్పుడు సదరు విద్యార్థులు చెల్లించిన ఫీజు రిసిప్టులు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. సోషల్‌మీడియాలోనూ వైరల్‌గా మారాయి. వాస్తవానికి ఈ తరహాలో పీఆర్వోలు అనేక ఇంజినీరింగ్‌ సీట్లను నిబంధనలకు విరుద్ధంగా కమీషన్‌ పద్ధతిన అప్పగించారని విమర్శలు వెల్లువెత్తతున్నాయి. ఇష్టానుసారంగా ఇంజినీరింగ్‌ సీట్లు అమ్ముకోవడంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.

ఉత్తమ ఉపాధ్యాయులు 60 మంది

తిమ్మాపూర్‌ పరిధిలోని రెండు ప్రముఖ ఇంజినీరింగ్‌ కళాశాలలపై ఉన్నత విద్యామండలికి ఫిర్యాదులు వెళ్లాయి. నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్‌ షెడ్యూల్‌కు ముందే సీట్ల విక్రయాలు జరిగాయంటూ పలువురు ఉన్నత విద్యామండలిని ఆశ్రయించారు. వాస్తవానికి తెలంగాణ అడ్మిషన్‌ అండ్‌ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) ప్రతీ కళాశాలకు ఫీజు నిర్ణయిస్తుంది. ఇక్క డ రెండు కళాశాలలు ఆ నిబంధనలను తుంగలోకి తొక్కడం గమనార్హం. ఈ రెండు కళాశాలల్లో ఒకటి మేనేజ్‌మెంట్‌ కోటాలో సీటుకు రూ. 63,000గా నిర్ణయించింది. సదరు కళాశాల అదనంగా రూ.7000 జోడించి రూ.70,000గా ఫీజు అని చెప్పింది. ఈ విషయంలో కాలేజీకి, విద్యార్థికి మధ్య విభేదాలు తలెత్తాయి. తన వద్ద అదనపు ఫీజు వసూలు చేయడంపై సదరు విద్యార్థి ఉన్నత విద్యామండలికి రిసిప్టులతో కలిపి ఫిర్యాదు చేశాడు. పొరుగున మరో కళాశాల అయితే ఏకంగా రూ.20,000 అదనంగా కలిపి వసూలు చేస్తోంది. వాస్తవానికి డెవలప్‌మెంట్‌ ఫీజు, అడ్మిషన్‌ ఫీజులో అదనపు వసూళ్లు కళాశాలలే నిర్ణయిస్తాయి. కానీ, బోధన ఫీజులోనూ కాలేజీలో మార్పులు చేయడంపై విద్యార్థులు మండిపడుతున్నారు. త్వరలోనే ఈ వ్యవహారంపై ఉన్నత విద్యామండలి సదరు కాలేజీలకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement