
నిరీక్షణ.. నిరసన
యూరియా కోసం రైతుల ఆందోళన
అధికారుల వైఖరిపై చెర్లభూత్కూర్‌లో ధర్నా
నగునూరులో ఆగ్రోస్ కేంద్రం ఎదుట పాసు పుస్తకాల వరుస
గన్నేరువరంలో పోలీసు పహారాలో పంపిణీ
గద్దపాకలో బారులు తీరిన మహిళా రైతులు
కరీంనగర్‌రూరల్/గన్నేరువరం/శంకరపట్నం: యూరియా కోసం రైతుల కష్టాలు కొనసాగుతున్నాయి. యూరియా కోసం ఉదయం నుంచి నిరీక్షించిన రైతులు ఓపిక నశించి అధికారుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్‌లో ధర్నా చేపట్టారు. పోలీసు బందోబస్తుతో యూరియా పంపిణీ చేశారు. దుర్శేడ్ సహకార సంఘం, తీగలగుట్టపల్లిలోని డీసీఎంఎస్, నగునూరులోని ఆగ్రోస్ కేంద్రం, చెర్లభూత్కూర్‌లోని ఎరువుల గోదాం వద్ద యూరియా కోసం శనివారం ఉదయం 7గంటల నుంచే రైతులు తరలివచ్చారు. గతంలో ఉదయం 8గంటల నుంచే పంపిణీ చేయగా శనివారం 10గంటల నుంచి ఏఈవోలు మాత్రమే యూరియా పంపిణీ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దుకాణాలు తీయకముందే నగునూరు ఆగ్రోస్ కేంద్రం ఎదుట పాసు పుస్తకాలు వరుసలో పెట్టారు. అధికారుల నిర్లక్ష్యవైఖరిని నిరసిస్తూ చెర్లభూత్కూర్‌లో గోదాం ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. శనివారం పాసు పుస్తకాల జిరాక్సులు ఇచ్చిన రైతులకు ఆది, సోమవారాల్లో యూరియా పంపిణీ చేస్తామని ఏవో సత్యం తెలిపారు. గన్నేరువరం సహకార సంఘం ఎరువుల దుకాణం ఎదుట రైతులు బారులు తీరారు. పోలీసుల పహారా మధ్య ఒక్కో రైతుకు రెండు బస్తాలు అందించారు. శంకరపట్నం మండలం గద్దపాక సహకార సంఘం వద్ద శనివారం వేకువజాము నుంచే మహిళా రైతులు ఇంటి పనులు పక్కన పెట్టి బారులు తీరారు. గద్దపాక, తాడికల్ సహకార సంఘాలకు శనివారం 350 బస్తాల చొప్పున యూరియా వచ్చింది. రైతులు వందలాదిగా సహకార సంఘాలకు చేరుకున్నారు. గద్దపాకలో మహిళా రైతులకు కూపన్లు జారీచేసి యూరియా పంపిణీ చేశారు. ఎక్కువ విస్తీర్ణం ఉన్న రైతులకు రెండు, తక్కువ విస్తీర్ణం ఉన్న రైతులకు ఒక్కోబస్తా చొప్పున అందించారు. యూరియా దక్కని రైతులు సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు.
దుర్శేడ్‌లో పోలీసు పహారాలో యూరియా కోసం వరుసలో నిల్చున్న రైతులు
కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్‌లో
ఆందోళన చేస్తున్న రైతులు
గన్నేరువరంలో తరలివచ్చిన రైతులు

నిరీక్షణ.. నిరసన

నిరీక్షణ.. నిరసన

నిరీక్షణ.. నిరసన