
కపాస్ కిసాన్.. కర్శకుని నిషాన్
జిల్లాలో..
కరీంనగర్ అర్బన్: నిలకడలేని పత్తి ధరలతో నష్టపోయే రైతన్నకు ఉపయుక్తమైన యాప్ అందుబాటులోకి వచ్చింది. పత్తి రైతులందరూ 2025–26 సంవత్సరానికి సంబంధించి కనీస మద్దతు ధర పొందేందుకు వీలుగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) దేశంలోనే తొలిసారిగా శ్రీకపాస్ కిసాన్‌శ్రీ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. పంట పండించే రైతులు తమ పేర్లను సెప్టెంబరు 1నుంచి 30 వరకు యాప్‌లో నమోదు చేసుకోవాలి. వివరాలు నమోదు చేసుకున్న వారే సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో తమ సరకు విక్రయించుకునే అవకాశం ఉంటుంది. నూతన కార్యక్రమంపై రైతుల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని మార్కెటింగ్ శాఖ సిబ్బందిని సీసీఐ అధికారులు ఆదేశించారు.
విక్రయ సమయంలో ఇదే ఆధారం
ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం పత్తి క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.8,110గా ప్రకటించింది. కనీస ధర పొందాలంటే యాప్‌లో రిజిస్టర్ అయిన రైతులు పత్తి విక్రయ సమయంలో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ రోజు సీసీఐ కేంద్రంలో వారు విక్రయించాలో వివరాలు తెలుపుతూ యాప్ సమాచారం ఇస్తుంది. ఇలా చేయడం వల్ల రోజుల తరబడి నిరీక్షించాల్సిన బాధ తప్పుతుంది. స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది.
అక్రమ విక్రయాలకు ముకుతాడు
పత్తి విక్రయ సమయంలో ధరల దోబూచూలాడుతూ రైతులను పీల్చిపిప్పి చేయడం వ్యాపారులకే చెల్లు. అంతిమంగా వారు చెప్పిన రేటుకే అమ్మేలా సఫలీకృతులవుతుంటారు. విక్రయాలు పూర్తయ్యాక రైతుల పేరుతో సదరు వ్యాపారులే సీసీఐకి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అసలైన రైతుకు మద్దతు ధక్కకపోగా వ్యాపారులే రెండురకాలుగా లాభాలు గడిస్తున్నారు. కరీంనగర్, జమ్మికుంట, గంగాధర, చొప్పదండి మార్కెట్లతో పాటు జిన్నింగ్ మిల్లుల్లో అక్రమాలు షరామామూలేనన్న ఆరోపణలున్నాయి. యాప్‌తో సదరు అక్రమాలకు చెక్ పడినట్లేనని విఽశ్లేషకులు భావిస్తున్నారు. పత్తి పంట వేస్తేనే వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.
తగ్గుతున్న పత్తి సాగు
గతేడాది కంటే ఈఏడాది జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం తగ్గింది. గతంలో 70–90వేల ఎకరాల్లో సాగయ్యేది. చీడపీడలతో పాటు దళారుల దోపిడీతో సాగు విస్తీర్ణం క్రమేణా తగ్గుతోంది. 2020లో 90వేల ఎకరాల్లో పత్తి సాగవగా ప్రస్తుతం 50వేలకు చేరింది. కాగా వచ్చే నెల రెండో వారం నుంచి పంట చేతికొస్తుంది. కొద్ది రోజుల నుంచి విస్తారంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఈసారి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు. కాగా పత్తి రైతులు ‘కిసాన్ కపాస్’ యాప్‌ను తమ మొబైల్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలని, తర్వాత పేర్లు నమోదు చేసుకోవాలని వ్యవసాయ మార్కెటింగ్ అధికారులు వివరించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా మద్దతు ధర దక్కేలా చేయడమే ప్రభుత్వ ఉద్దేశం. కార్యక్రమంపై జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వ్యవసాయ మార్కెటింగ్ అధికారులు పేర్కొన్నారు.
పత్తి రైతులకు ప్రత్యేక యాప్
అందుబాటులోకి తెచ్చిన సీసీఐ
అక్రమ విక్రయాలకు ముకుతాడు
రైతుల సంఖ్య: 2,18,012
సాగు విస్తీర్ణం: 3.33 లక్షల ఎకరాలు
పత్తి సాగుచేసే రైతులు 32,019
పత్తి సాగు విస్తీర్ణం: 50,000 ఎకరాలు
దిగుబడి అంచనా: 6 లక్షల క్వింటాళ్లు
యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందే
తొలుత ‘కపాస్ కిసాన్’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. సదరు రైతుకు సంబంధించి భూమి రికార్డులు, రెవెన్యూ శాఖ అధికారుల ద్వారా ధ్రువీకరించిన పత్తి పంట రికార్డు, ఆధార్ కార్డు వివరాలు అందులో నమోదు చేయాలి. ఫలితంగా దేశంలో పత్తి రైతులు, పంట విస్తీర్ణం, సాంద్రత తదితర వివరాలన్నీ సీసీఐకి చేరుతాయి. వచ్చే నెలాఖరుకు రైతులు యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాలి.