
పొద్దుపొద్దున్నే గోదాంల వద్దకు..
శంకరపట్నం/ఇల్లందకుంట/జమ్మికుంట/రామడుగు: జిల్లాలో యూరియా కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. శంకరపట్నం మండలం రాజాపూర్, తాడికల్ సహకార సంఘాలకు సోమవారం రాత్రి 340 బస్తాల చొప్పున రెండు లారీల యూరియా వచ్చింది. మంగళవారం వేకువజామున్నే రైతులు బారులు తీరారు. మహిళలు సైతం ఇంటిపనులు వదలిపెట్టి క్యూలో ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కబస్తా చొప్పున పంపిణీ చేశారు. యూరియా అందని రైతులు ఆందోళన చేస్తూ ఇంటిముఖం పట్టారు. ఇల్లందకుంట సహకార సంఘానికి 450 బస్తాలు రాగా.. పోలీసు పహారాలో ఒక్కో రైతుకు ఒక్కో బస్తా అందించారు. రామడుగు, కొక్కెరకుంట సొసైటీల వద్ద మంగళవారం ఉదయం నుంచే రైతులు బారులు తీరారు. జమ్మికుంట పీఏసీఎస్‌కు 340 బస్తాలు రాగా.. ముందస్తుగా పేర్లు నమోదు చేసుకున్న రైతులకు రెండు బస్తాల చొప్పున 170 మందికి యూరియా అందజేశారు.