
చదువుకుంటేనే భవిష్యత్
అమ్మానాన్న కష్టం చదివే పుస్తకాల్లో కనిపించాలి
సైకిళ్లను సద్వినియోగం చేసుకోవాలి
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
మానకొండూర్: చదువుకుంటే భవిష్యత్ బంగారుమయం అవుతుందని, అమ్మానాన్న పడుతున్న కష్టాలను గుర్తుచేసుకుంటూ జీవితంలో స్థిరపడాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ సూచించారు. మానకొండూర్‌లో మంగళవారం ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. అనంతరం బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు చాలా మంది పేదవాళ్లేనన్నా రు. ప్రధానమంత్రి మోదీ ఆలోచన మేరకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టానన్నారు. తాను పేద కుటుంబం నుంచే వచ్చానని, ఆ రోజుల్లో తాను చదువుకునేందుకు పడ్డ కష్టాలను గుర్తు చేశారు. సైకిళ్లు పంపిణీతో పాఠశాలల్లో డ్రాప్ అవుట్ ఉండదని, హాజరుశాతం పెరుగుతుందన్నారు. సైకిళ్లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రానున్న రోజుల్లో 10వ తరగతికి వచ్చే 9,8 తరగతుల పిల్లలకు కూడా సైకిళ్లు అందజేస్తామన్నారు. గన్నేరువరం మండలం చొక్కారావుపల్లె నుంచి మా నేరు మీదుగా ఖాజీపూర్ వరకు రూ.77 కోట్ల నిధులు తెచ్చి త్వరలో వంతెన పనులు చేపడతామని హామీ ఇచ్చారు. రూరల్ ఏసీపీ విజయ్‌కుమార్, డీఈవో చైతన్య జైనీ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, తహసీల్దార్ విజయ్, ఎంపీడీవో వరలక్ష్మి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రాల వెంకటరెడ్డి పాల్గొన్నారు.