
సేవా దృక్పథంతో వైద్యం అందించాలి
కరీంనగర్‌టౌన్: ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు సేవా దృక్పథంతో పని చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులకు ‘క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్, పీఎన్‌డీటీ చట్టం’పై వర్క్‌షాప్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రైవేటు ఆసుపత్రులు నిబంధనలు పాటించాలని అన్నారు. అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. 10మంది కన్నా ఎక్కువ ఉద్యోగులుంటే ఐసీసీ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రైవేటు అంబులెన్స్‌లను వారి ఆస్పత్రుల్లోనే నిలుపుకోవాలని, ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద నిలిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సిజేరియన్ కాన్పుల్లో కరీంనగర్ ముందుండడం బాధాకరమైన విషయమని, సాధ్యమైనంత వరకు నార్మల్ డెలివరీలకు ప్రయత్నించాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, డీఎంహెచ్‌వో వెంకటరమణ, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.