
జైలు నుంచి విడిపించండి
ప్రవాసీ ప్రజావాణిలో బాధిత కుటుంబాల ఫిర్యాదు
జగిత్యాలక్రైం/సిరిసిల్ల: బహ్రెయిన్‌లో రెండేళ్ల జైలు శిక్ష పడిన ఐదుగురిని విడిపించాలని కోరుతూ.. బాధితుల కుటుంబ సభ్యులు మంగళవారం హైదరాబాద్‌లోని సీఎం ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించారు. తమ కుటుంబ సభ్యులను విడిపించాలని నలుగురి తల్లులు, ఒకరి చెల్లెలు సహాయం కోసం ప్రజావాణిని ఆశ్రయించారు. సీఎంకు వినతిపత్రం సమర్పించారు. గడువు తీరిన ఆహార ఉత్పత్తుల తేదీలను ఫోర్జరీ చేసి మార్చడం.. నిల్వ పదార్థాల మార్కెటింగ్ చేసిన కేసులో అక్కడి న్యాయస్థానం ముగ్గురికి మూడేళ్లు, 19మందికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. నిజామాబాద్‌కు చెందిన నకిడి లింబాద్రి (డిచ్‌పల్లి), కర్రోల్ల లక్ష్మీనర్సింహ (మల్లారం), తిమ్మజడ సంతోష్ (తిర్మన్‌పల్లి), జగిత్యాలకు చెందిన గోవిందు రాకేశ్ (రత్నాపూర్), రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన బంటుబాబు (కొండాపూర్)కు చెందిన ఐదుగురు వ్యక్తులు ఉన్నారు. వీరిని విడిపించాలని ఎన్‌ఆర్‌ఐ అడ్వైజరీ కమిటీ చైర్మన్, అంబాసిడర్ వినోద్‌కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, గల్ఫ్ కుటుంబాలను సీఎం ప్రజావాణి నోడల్ అధికారి దివ్య దేవరాజన్ వద్దకు తీసుకెళ్లి వివరించారు. సీఎంవోలో కీలక అధికారి ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి దృష్టికి తీసుకెళ్లారు.