
చిల్లరగాళ్లతో న్యూసెన్స్ చేస్తున్నారు
కరీంనగర్ కార్పొరేషన్/గంగాధర: తన నియోజకవర్గంలో కొంతమంది చిల్లరగాళ్లకు కేటీఆర్ డబ్బులు ఇచ్చి న్యూసెన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మండిపడ్డారు. బీఆర్‌ఎస్ హయాంలో నియోజకవర్గంలో కొత్తగా ఒక ఎకరాకు నీళ్లిచ్చినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. శనివారం నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో మాట్లాడుతూ.. గాయత్రి పంప్‌హౌస్ సందర్శనకు వచ్చిన నేతలు బీఆర్‌ఎస్ హయాంలో కొత్తగా ఒక్క ఎకరా ఆయకట్టుకు నీళ్లిచ్చారో కేటీఆర్, హరీశ్‌రావు చెప్పాలని డిమాండ్ చేశారు. కొండగట్టుకు రూ.500 కోట్లు ఇస్తానన్న కేసీఆర్, కనీసం రూ.5కూడా ఇవ్వలేదన్నారు. చొప్పదండి నియోజకవర్గంలో చిల్లరగాళ్లకు డబ్బులు ఇచ్చి న్యూసెన్స్ చేస్తే, సిరిసిల్ల, సిద్దిపేటలో కూడా తాము అలానే చేస్తామని హెచ్చరించారు. నియోజకవర్గంలో పిచ్చి ప్రేలాపనలు చేస్తే నాలుక చీరేస్తామని, పండబెట్టి తొక్కుతామని ధ్వజమెత్తారు. గంగాధరలో త్వరలో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ఉత్తర్వు రానుందన్నారు. గతంలో వైఎస్‌ఆర్ హయాంలో ఇండ్లు ఇచ్చామని, ఇప్పుడు రేవంత్ ఆధ్వర్యంలో ఇండ్లు ఇస్తున్నట్లు తెలిపారు. ఆదివారం గంగాధరలో జరిగే జనహిత పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేశం, ఓబీసీ సెల్ రుద్ర సంతోష్ పాల్గొన్నారు. అనంతరం శనివారం ఉప్పరమల్యాల నుంచి మధురానగర్ వరకు నిర్వహించే మీనాక్షి నటరాజన్ జనహిత యాత్ర రూట్ మ్యాప్‌ను, మధురానగర్‌లో నిర్వహించే రోడ్‌షో ప్రాంతాన్ని పరిశీలించారు.