
బేతిగల్‌లో వైద్యశిబిరం
వీణవంక(హుజూరాబాద్): వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో నెల రోజులుగా జాండీస్(పచ్చ కామెర్లు) వ్యాధి వ్యాప్తి చెందడంతో గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. వ్యాధితోపాటు జ్వరాలు వస్తుండడంతో గ్రామస్తులు ఆసుపత్రులపాలవుతున్న తీరుపై ఆదివారం సాక్షిలో బేతిగల్‌కు జాండీస్ కథనం ప్రచురితమైంది. ఈ సంఘటనపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కార్యాలయం నుంచి ఆరా తీశారు. నీటి నమూనా పరీక్షలు చేయాలని ఆహార భద్రత అధికారులకు సూచించారు. గ్రామంలో హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవసరమైతే నిమ్స్ వైద్యులతో విశ్లేషణ చేయాలని సూచించినట్లు సమాచారం. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ దృష్టికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తీసుకెళ్లారు. కలెక్టర్, ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడినట్లు తెలిసింది. గ్రామంలో వారం రోజులపాటు క్యాంపు ఏర్పాటు చేయాలని సూచించారు. కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించాలని కోరారు. కేశవపట్నం వైద్యాధికారి శ్రావణ్‌తోపాటు వైద్య సిబ్బంది గ్రామంలో పర్యటించారు. జీపీ వద్ద శిబిరం ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు. జాండీస్, జ్వరాల బారిన పడిన వ్యక్తుల వద్దకెళ్లి రిపోర్టులను పరిశీలించారు. శానిటేషన్ పరిశీలించారు. డ్రైనేజీలు అపరిశుభ్రంగా ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. దగ్గు, జలుబు, తలనొప్పి, ఒళ్లు నొప్పులుంటే వెంటనే పరీక్షలు చేసుకోవాలని సూచించారు. వైద్యులు వరుణ, రజనీకాంత్, ఎంఎల్‌హెచ్‌పీ రత్నమాల, అనిల్‌కుమార్, ఏఎన్‌ఎం పద్మ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

బేతిగల్‌లో వైద్యశిబిరం