
క్రిమిసంహారక మందు తాగి యువకుడి బలవన్మరణం
వెల్గటూర్: కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని ఎండపల్లిలో వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. గొల్లపల్లి మండలం దమ్మన్నపేటకు చెందిన అంగడి రాజు (26)కు కొంతకాలంగా భార్యతో గొడవలు జరుగుతున్నాయి. గురువారం కూడా గొడవ కాగా ఇంటినుంచి వెళ్లిపోయాడు. ఎండపల్లి శివారులో క్రిమి సంహారక మందు తాగాడు. చుట్టుపక్కల వారు సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. రాజు తండ్రి చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు.
ధర్మపురి: మేకలను మేపేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కెనాల్‌లో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన దోనూర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. దోనూరుకు చెందిన మాసం చంద్రయ్య (59) ఎప్పటిలాగే శనివారం మేకలను మేపేందుకు వెళ్లాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా గ్రామ శివారులోని భీమన్న గుట్ట వద్ద ప్రమాదవశాత్తు ఎస్సారెస్పీ చిన్న కాలువలో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. చంద్రయ్యకు భార్య నర్సవ్వ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. నర్సవ్వ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉదయ్‌కుమార్ తెలిపారు.
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు లేబర్ గేట్ సమీపంలోని రాజీవ్ రహదారిపై రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనగా నలుగురికి గాయాలయ్యాయి. శనివారం రాత్రి న్యూపీకేరామయ్య కాలనీకి చెందిన రాధారపు గట్టయ్య టీవీఎస్ వాహనంపై ప్రాజెక్టు లేబర్ గేట్ నుంచి మెయిన్ రోడ్‌కు వస్తుండగా మంథని ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు మరో బైక్‌పై వేగంగా వచ్చి గట్టయ్య వాహనాన్ని ఢీ కొట్టారు. గట్టయ్యతో పాటు మంథని కౌశిక్, బూడిద మనోజ్, బూడిద సాయి మనోహర్‌కు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.
ఓదెల(పెద్దపల్లి): శ్రావణమాసం సందర్భంగా ఈ నెల 21న ఓదెల మల్లికార్జునస్వామి ఆలయంలో లక్షబిల్వార్చన పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో సదయ్య శనివారం తెలిపారు. సామూహిక లక్షబిల్వార్చన పూజలో పాల్గొనే దంపతులు రూ.200 చెల్లించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

క్రిమిసంహారక మందు తాగి యువకుడి బలవన్మరణం