
రోడ్డు ప్రమాదంలో కార్మికుడి మృతి
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ పీటీఎస్‌లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కాంట్రాక్టు కార్మికుడు మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. రామగుండంలోని విద్యుత్ నగర్‌కు చెందిన పెయింటర్ మేకల మల్లేశ్(50) పర్మినెంట్ టౌన్‌షిప్‌లో ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. ఈక్రమంలో బొద్దున సంజయ్ తన బైక్‌ను అజాగ్రత్తగా వేగంగా నడిపి మల్లేశ్ వాహనాన్ని వెనుకవైపు నుంచి ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన మల్లేశ్‌ను స్థానిక ధన్వంతరి ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేశాక గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యుల సూచన మేరకు కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు వంశీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై ఉదయ్‌కిరణ్ తెలిపారు.
రైలు కిందపడి ఆత్మహత్య
ఓదెల(పెద్దపల్లి): మండల కేంద్రానికి చెందిన గీతకార్మికుడు అయిలు రాజు(41) శుక్రవారం ఇంటర్‌సిటీ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజు మనస్తాపంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని రైల్వే హెడ్‌కానిస్టేబుల్ తిరుపతి తెలిపారు. మృతుడి భార్య శారద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు.
చిరుత దాడిలో లేగదూడ హతం
కోనరావుపేట: మండలం గోవిందరావుపేటతండా (బావుసాయిపేట)లో లేగదూడపై చిరుత దాడి చేసింది. గ్రామానికి చెందిన గుగులోత్ పర్శరాములు పొలం వద్ద లేగదూడను ఉంచాడు. శుక్రవారం ఉదయం వెళ్లి చూసే సరికి దూడ మృతి చెందింది. ఆనవాళ్లను బట్టి చిరుతపులి దాడి చేసి చంపినట్లు భావిస్తున్నారు. కొంతకాలంగా ఎలాంటి కదలిక లేని చిరుతపులి మళ్లీ దాడి చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రాత్రి వేళల్లో పొలాల వద్దకు వెళ్లాలంటే భయపడుతున్నారు.
ముగ్గురిపై కేసు
బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని కొదురుపాక గ్రామంలోని ఓ ఆలయ బడ్జెట్ విషయంలో జూలై 28వ తేదీ రాత్రి చెన్నమనేని కొండలరావుపై బాలగోని వెంకటేశ్, సిద్ధాంతి దీక్షిత్, సిద్ధాంతి కళాధర్ దాడి చేసినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై రాజయ్య తెలిపారు. వెంకట రామారావు ప్రోత్సాహంతోనే దాడి చేశారని చెన్నమనేని కొండలరావు ఫిర్యాదు చేశాడని పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదంలో కార్మికుడి మృతి

రోడ్డు ప్రమాదంలో కార్మికుడి మృతి