
విద్యుత్‌షాక్‌తో మహిళ మృతి
ఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామానికి చెందిన కరికవేణి లక్ష్మి(35) శుక్రవారం విద్యుత్‌షాక్‌తో చనిపోయింది. లక్ష్మికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరైంది. కొత్తఇళ్లు నిర్మించేంత వరకు నివాసం ఉండేందుకు పాతఇంటి వెనకాల గురువారం రేకులషెడ్డు వేశారు. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు పిల్లలు స్కూల్‌కు వెళ్తారని నీళ్లు వేడి చేసేందుకు స్విచ్‌బోర్డులో వాటర్ హీటర్ ప్లగ్ పెట్టే ప్రయత్నంలో విద్యుత్‌షాక్‌కు గురై కింద పడిపోయింది. బంధువులు సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరిశీలించి చనిపోయిందని చెప్పారు. లక్ష్మి కొడుకు వరుణ్ కుమార్ తొమ్మిదోతరగతి, కూతురు వైష్ణవి నాలుగోతరగతి చదువుతున్నారు. భర్త రాజు అంధుడు. కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు.
పిట్టలు కొట్టేందుకు వెళ్లి.. బావిలో పడి
● మహిళా రైతు దుర్మరణం
మల్యాల(చొప్పదండి): మహిళా రైతు మొక్కజొన్న చేనులో పిట్టలు కొట్టేందుకు వెళ్లి, ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతిచెందిన ఘటన ముత్యంపేట గ్రామంలో జరిగింది. మల్యాల మండలం ముత్యంపేటకు చెందిన సంత లక్ష్మి(49) శుక్రవారం ఉదయం ఇంటి సమీపంలోని మొక్కజొన్న చేనులో పిట్టలు కొట్టేందుకు వెళ్లింది. ఈక్రమంలో ప్రమాదశాత్తు బావిలో పడిపోయింది. లక్ష్మి చాలాసేపటి వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో చేనుకు వెళ్లి వెతకగా బావిలో మృతదేహం కనపడడంతో స్థానికుల సాయంతో బయటకు తీశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్‌కుమార్ తెలిపారు.
క్రెడిట్‌కార్డు పేరిట సైబర్‌మోసం
జగిత్యాలక్రైం: ఆర్‌బీఎల్ క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామంటూ శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన రమేశ్‌ను సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. వివరాలు.. రమేశ్‌కు సైబర్ నేరగాళ్లు నో బ్రోకర్ అనే యాప్‌ను పంపించారు. దానిని ఓపెన్ చేస్తే క్రెడిట్ కార్డు లిమిట్ పెరుగుతుందని నమ్మించారు. దీంతో రమేశ్ యాప్‌ను ఓపెన్ చేయగానే ఆయన బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ.40,997 సైబర్ నేరగాళ్లు కాజేశారు. దీంతో బాధితుడు శుక్రవారం రాత్రి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

విద్యుత్‌షాక్‌తో మహిళ మృతి

విద్యుత్‌షాక్‌తో మహిళ మృతి