
ఆటో నడవక.. ఫైనాన్స్ కట్టలేక ఆత్మహత్య
తిమ్మాపూర్: మహాలక్ష్మి పథకం మరో ఆటో డ్రైవర్ ను కబలించింది. ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని మాట ఇచ్చిన ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కిస్తీలు కట్టలేక ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎల్‌ఎండీ ఎస్సై శ్రీకాంత్, గ్రామస్తుల కథనం ప్రకారం.. పర్లపల్లి గ్రామానికి చెందిన గోపగోని సంతోష్ (29) కొన్నేళ్లుగా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొన్నిరోజులుగా ఆటో సరిగా నడవక కరీంనగర్‌లోని భజరంగ్ ఫైనాన్స్‌లో తీసుకున్న లోన్ కిస్తీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాడు. భార్య మమత సైతం మతిస్థిమితం సరిగా లేక గొడవపడి వేరుగా ఉంటున్నది. ఈనెల14న రాత్రి ఇంటికి వచ్చిన సంతోష్ ఎప్పటిలాగే తన రూంలోకి వెళ్లి పడుకున్నాడు. అర్థరాత్రి సమయంలో తన అక్క రజిత అన్నం తినేందుకు రమ్మనగా స్పందన లేకపోవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం తెలిపింది. దీంతో వారు తలుపులు పగులగొట్టి చూడగా లోపల రేకుల షెడ్డుకు ఉరివేసుకుని కనిపించాడు. కిరాయిల లేక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడని, ప్రభుత్వం ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామ ఆటో యూనియన్ నాయకులు కోరారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ వివరించారు.