
అతివకు అక్షర సేవ
కరీంనగర్ అర్బన్: ఇల్లాలి చదువు.. ఇంటికి వెలుగనే ఉద్దేశంతో నిరక్షరాస్యతను రూపుమాపే చర్యలు చేపడుతున్నారు. నూతన విద్యాహక్కు చట్టం ప్రకారం సమాజంలో అందరూ చదువుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఉల్లాస్ (అండర్ స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ సొసైటీ) కార్యక్రమం ప్రవేశ పెట్టింది. 15 ఏళ్లు పైబడిన నిరక్షరాస్యులందరినీ అక్షరాస్యులుగా మార్చాలన్నది ప్రధాన లక్ష్యం. పురుషులతో పోల్చితే మహిళల అక్షరాస్యత రేటు సుమారు 18శాతం తక్కువగా ఉండటంతో తొలుత మహిళల్లో అక్షర చైతన్యం తేవాలని నిర్ణయించారు. జిల్లాలోని స్వయం సహాయక సంఘాల సభ్యుల్లో చదువురాని అతివలను ఇప్పటికే గుర్తించి వారి వివరాలను యాప్‌లో నమోదు చేస్తున్నారు. సదరు మహిళలకు అక్షరాలు, అంకెలు నేర్పడంతోపాటు ఆర్ధిక, డిజిటల్ అక్షరాస్యత, వాణిజ్య నైపుణ్యాలు, ఆరోగ్య సంరక్షణ, కుటుంబ సంక్షేమంపై అవగాహన కల్పిస్తారు. నెలాఖరులోపు అక్షరాలు దిద్దించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.
సాగుతున్న కసరత్తు
తొలుత జిల్లా రిసోర్స్ పర్సన్ల (డీఆర్పీ)లకు రాష్ట్రస్థాయిలో శిక్షణనిచ్చారు. వీరు జిల్లాలోని మండల రిసోర్స్ పర్సన్ల(ఎమ్మార్పీ)కు ఉల్లాస్ కార్యక్రమంపై అవగాహన కల్పించాలి. వీరు గ్రామాల్లోని వీవోలకు, క్లస్టర్‌స్థాయి వలంటీర్లకు శిక్షణనిస్తారు. మండలస్థాయిలో రిసోర్స్ పర్సన్లుగా ఎంపిక చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఐకేపీ ఏపీఎంలకు ఇటీవల జిల్లాస్థాయిలో శిక్షణ ఇచ్చారు. వీవోలు, వలంటర్లకు తర్ఫీదు ఇవ్వడానికి తేదీలు ఖరారు కాలేదు. జిల్లాకు సరిపడా పుస్తకాలూ త్వరలో చేరనున్నాయి.
లక్ష్యానికి మించి అక్షరాస్యతకు చర్యలు
జిల్లాలో 50వేలకు పైగా చదువురాని మహిళలను అక్షరాస్యులుగా మార్చాలని నిర్దేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో లక్ష్యాన్ని మించి గుర్తించి ఉల్లాస్ యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఇప్పటివరకు 20వేల మంది వివరాలను నిక్షిప్తపరిచారు. పది మందికి ఒకరు చొప్పున చదువు చెప్పే వలంటీర్లను ఎంపిక చేయనున్నారు. జాతీయ నూతన విద్యావిధానంలో భాగంగా 2022లో ‘ఉల్లాస్’ పట్టాలెక్కింది. జిల్లాలో సదరు పక్రియ నత్తనడకన సాగుతుండగా ఈ సారి శరవేగంగా పూర్తి చేయాలని నిర్ణయించారు. 3 నెలల్లో లక్ష్యం పూర్తిచేయనుండగా ఎక్కువ మంది పనులకు వెళ్తారు. కనుక సాయంత్రం వేళల్లో తరగతులు నిర్వహించనున్నారు. వయోజనుల అభ్యసన సామర్థ్యంపై పరీక్షలుండనున్నాయని అధికారులు వివరించారు.