
చీకటి రోజు ఆగస్టు 14
కరీంనగర్‌టౌన్: 1947 ఆగస్టు 14 దేశ చరిత్రలో చీకటి రోజని, దేశ విభజన గాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని, బ్రిటిష్ వలస పాలకుల దుర్నీతితో ప్రపంచంలోనే అతి పెద్ద హింసాత్మక, దారుణాలతో మత ప్రాతిపదికన పాకిస్తాన్ ఏర్పడిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. ఆగస్టు 14 విభజన గాయాల స్మృతి దినాన్ని పురస్కరించుకుని పార్టీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్ నుంచి బస్టాండ్ వరకు మౌన ప్రదర్శన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. 1947 ఆగస్టు 15న అర్ధరాత్రి లభించిన భారత స్వాతంత్య్రానికి సంబరాలు చేసుకోవాలో విభజన విషవలలో చిక్కిన అమాయక ప్రాణాలను చూసి దుఃఖించాలో తెలియని దుస్థితి అన్నారు. మాజీ మేయర్ సునీల్‌రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గుగ్గిళ్లపు రమేశ్, బత్తుల లక్ష్మినారాయణ, వెంకట్‌రెడ్డి, నర్సింహరాజు, రాపర్తి ప్రసాద్ పాల్గొన్నారు.