
వృద్ధాశ్రమంలో ఎంపీడీవో మృతి
రామడుగు: రామడుగు మండల పరిధి వెలిచాల మన స్పందన వృద్ధాశ్రమంలో మంచిర్యాల జిల్లా కన్నెపల్లి ఎంపీడీవో తీగల శంకర్ అనారోగ్యంతో మంగళవారం మృతిచెందినట్లు నిర్వాహకుడు మంచికట్ల శ్రీనివాస్ తెలిపారు. కొద్దిరోజుల క్రితం కరీంనగర్ బస్టాండ్‌లో ఎంపీడీవో పడిపోయి ఉండగా.. పోలీసులు ఆశ్రమం నిర్వాహకులకు సమాచారం అందించారు. వారు తీసుకొచ్చి ఆశ్రమంలో చేర్చుకున్నారు. శంకర్ స్వస్థలం హన్మకొండ జిల్లా. ఆయన మృతదేహాన్ని అతని బంధువులకు అప్పగించినట్లు శ్రీనివాస్ తెలిపారు. శంకర్ మృతదేహనికి రామడుగు ఎంపీడీవో రాజేశ్వరీ, ఎంపీడీవోలు శ్రీనివాస్, దివ్యదర్శన్‌రావు, ఎంపీవో శ్రావణ్‌కుమార్ పలువురు నివాళులర్పించారు.
ఎఫ్‌సీఐ కార్మికురాలు..
జమ్మికుంట(హుజూరాబాద్): మున్సిపల్ పరిధిలోని ఎఫ్‌సీఐలో కార్మికురాలిగా విధులు నిర్వహిస్తున్న మహిళ మృతిచెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మికుంట మున్సిపల్ పరిధి కొత్తపల్లి గ్రామానికి చెందిన పారునంది ప్రమీల(56) ఎఫ్‌సీఐలో స్వీపర్ విధులు నిర్వహిస్తోంది. మంగళవారం అకస్మాత్తుగా కిందపడిపోయింది. తోటి కార్మికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రమీల 25 ఏళ్లుగా ఎఫ్‌సీఐలో స్వీపర్‌గా పని చేస్తుందని, ఆమె మృతిపట్ల మేనేజర్ కిషన్ సంతాపం వ్యక్తం చేశారు.
రైలుకింద పడి యువకుడి ఆత్మహత్య
జమ్మికుంటరూరల్(హుజూరాబాద్): రైలుకింద పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రామగుండం రైల్వే హెడ్‌కానిస్టేబుల్ గంగారపు తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన చెన్నూరి రవి(29)గ్రామ సమీపంలోని పట్టాల వద్ద గుర్తు తెలియని రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రవి జమ్మికుంటలో బ్యాండ్‌మేళం పని, కూలీ పని చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. అతడికి వివాహం కాలేదు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. రవి మృతదేహాన్ని తల్లి మధునమ్మ, అన్న ప్రశాంత్ చూసి గుర్తుపట్టారు. కేసు దర్యాప్తు చేస్తున్నటు రామగుండం రైల్వే పోలీస్ హెడ్‌కానిస్టేబుల్ తెలిపారు.
అఘోరి శ్రీనివాస్‌కు బెయిల్
కరీంనగర్‌క్రైం: కొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుపై నమోదైన కేసులో అఘోరి శ్రీనివాస్‌కు కరీంనగర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడంతో పాటు ప్రతీ గురువారం కొత్తపల్లి పోలీస్‌స్టేషన్లో హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చింది. ఇదిలా ఉండగా హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు నుంచి మంగళవారం సాయంత్రం వరకు కూడా విడుదల కాలేదని సమాచారం.

వృద్ధాశ్రమంలో ఎంపీడీవో మృతి