
తాళం వేసిన ఇళ్లే టార్గెట్
రాయికల్(జగిత్యాల): రాయికల్ పట్టణం కేశవనగర్‌కు చెందిన పిప్పరి పురుషోత్తం ఇంట్లో దొంగలు చోరీకి యత్నించినట్లు బాధితుడు మంగళవారం తెలిపాడు. వారం క్రితం పురుషోత్తం హైదరాబాద్‌లో ఉంటున్న తన కొడుకు వద్దకు వెళ్లగా, ఇంటికి తాళం వేసి ఉందన్న విషయం గమనించిన దొంగలు చోరీకి యత్నించారు. బీరువాలోని చీరలు, సామగ్రిని చిందరవందరగా పడేశారు. స్థానికులు గమనించి ఇంటి యజమానికి సమాచారం ఇవ్వగా హైదరాబాద్‌లో ఉన్న పురుషోత్తం ఇంటికి వచ్చి పరిశీలించారు. వస్తువులు చోరీ కాకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఏదేమైనా వరుస దొంగతనాలతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
గొల్లపల్లిలో..
హుజూరాబాద్‌రూరల్: మండలంలోని గొల్లపల్లి గ్రా మంలో తాళం వేసి ఇంట్లో చోరీ జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన బండి సమ్మయ్య నెలరోజుల నుంచి కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇటీవల కుటుంబ సభ్యులు పని నిమిత్తం ఇంటికి వచ్చి తిరిగి ఆసుపత్రికి వెళ్లారు. ఎవరూ లేరని భావించిన దొంగలు ఇంట్లోకి చొరబడి 18 తులాల వెండి, మూడు తులాల బంగారం, రూ.8 వేల నగదు అపహరించినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

తాళం వేసిన ఇళ్లే టార్గెట్