జగిత్యాలరూరల్: జగిత్యాల జిల్లావ్యాప్తంగా వివిధ పోలీస్‌స్టేషన్లలో 36 కేసుల్లో నిందితుల నుంచి సీజ్ చేసిన 35.96 కిలోల గంజాయిని దహనం చేశారు. ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం జిల్లా డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ఇన్సినిరేషన్ ప్రక్రియ ద్వారా పర్యావరణ కాలుష్య నియంత్రణ నిబంధనలను పాటిస్తూ దహనం చేయడం జరిగిందని జగిత్యాల ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ, జిల్లాలో సుమారు రూ.9 లక్షల విలువైన 35.96 కిలోల గంజాయిని దహనం చేయడం జరిగిందన్నారు. కొందరు అక్రమార్జనలో భాగంగా గంజాయి సాగు, విక్రయిస్తూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో యువతను ప్రలోభాలకు గురిచేస్తూ మత్తులోకి దింపుతున్నారన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని అరికట్టడం కోసం జిల్లావ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎవరైనా గంజాయి విక్రయించినా, మత్తు పదార్థాలు రవాణా చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ సభ్యులు ఎస్బీ డీఎస్పీ వెంకటరమణ, డీఎస్పీలు రఘుచందర్, రాములు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ కిరణ్‌కుమార్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, సీఐలు రవి, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
35.96 కిలోల గంజాయి దహనం