
ఆసక్తి అంతంతే!
● అంబేడ్కర్ స్టేడియం షాపింగ్ కాంప్లెక్స్ దుకాణాల వేలం ● కొన్నింటికి డిమాండ్.. మరికొన్నింటికి నిల్ ● మరోసారి వేలం నిర్వహించే అవకాశం?
కరీంనగర్ కార్పొరేషన్:
స్మార్ట్‌సిటీలో భాగంగా నగరంలోని అంబేడ్కర్ స్టేడియంలో నిర్మించిన నూతన షాపింగ్ కాంప్లెక్స్ షాప్‌లకు వేలం నిర్వహించారు. కొన్ని షాప్‌లకు డిమాండ్ ఏర్పడగా, మరికొన్నింటికి ఎవరూ ముందుకు రాకపోవడంతో మరోసారి వేలం చేపట్టే పరిస్థితి నెలకొంది. నగరంలోని కళాభారతిలో మంగళవారం నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ ఆధ్వర్యంలో కాంప్లెక్స్‌లోని 22షాపులు, బాంక్వెట్‌హాల్, డార్మెటరీ సూట్‌రూంలకు బహిరంగ వేలంపాట నిర్వహించారు. రిజర్వేషన్ ప్రకారం ఎస్టీలకు ఒకటి (షాప్ నంబర్ 16), ఎస్సీలకు మూడు (6,17,22), దివ్యాంగులకు ఒకటి (15), నాయీబ్రాహ్మణుల కో ఆపరేటివ్ సొసైటీకి ఒకటి(10), స్వయం సహాయక సంఘాలకు రెండు (9,20) కేటాయించారు. మిగిలిన 1,2,3,4,5,7,8,11,12, 13,14,18,19,21 నంబర్‌షాప్‌లను జనరల్ కేటగి రీలో ఉంచారు. రూ.10 వేలు డీడీ చెల్లించిన వ్యాపారులు ఈ వేలం ప్రక్రియలో పాల్గొన్నారు.
రిజర్వేషన్ షాప్‌లకు డిమాండ్
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ కింద కేటాయించిన షాప్‌లకే బహిరంగ వేలంలో డిమాండ్ ఏర్పడింది. ఎస్సీలకు కేటాయించిన షాప్ నంబర్ 6కు ప్రతిపాదిత అద్దె రూ.11,800 కాగా వేలంలో రూ.20 వేలు పలికింది. షాప్‌నంబర్ 17కు అద్దె రూ.8,300 కాగా వేలంలో రూ.12,500, షాప్ 22కు రూ.9,237 కాగా, వేలంలో రూ.13,500కు దక్కించుకున్నారు. ఎస్టీ కోటాలో షాప్ నంబర్ 16కు రూ.8,300 అద్దె కాగా, రూ.12 వేలకు వేలం పాడారు. దివ్యాంగుల కోటాలో షాప్ నంబర్ 15కు రూ.7,700 కాగా రూ.11,500 వేలకు వేలంపాట సాగింది.
ఎనిమిది దుకాణాలకు టెండర్లు నిల్
22 షాప్‌ల్లో ఎనిమిది షాప్‌లకు వేలంలో ఎవరూ ముందుకు రాలేదు. షాప్ నంబర్ 1,2,11,12,13, 14,18,19కు, రెండోఅంతస్తులోని బాంక్వెట్ హాల్, డార్మెటరీ సూట్ రూమ్‌లకు ఎవరూ వేలం పాడలేదు. దీంతో ఆ షాప్‌లకు మరోసారి వేలం నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్వయంసహాయక సంఘాలకు ప్రతిపాదిత అద్దెకే షాప్‌లు దక్కాయి.
అనుమతి ఇవ్వొద్దని అభ్యంతరం
వేలం ప్రక్రియలో పోటీదారులు, అధికారుల నడుమ నిబంధనలపై స్వల్ప వాదన చోటుచేసుకుంది. షాప్ నంబర్ 8కి ఒక్కరే ఉండడంతో మూల జైపాల్ అనే వ్యక్తికి అప్పగించినట్లు అధికారులు ప్రకటించారు. కొద్దిసేపటికే మరో వ్యక్తి ఆ నంబర్‌కు పోటీరావడంతో అధికారులు అనుమతించారు. దీనిపై జైపాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ముందుకు తనకు కేటాయిస్తున్నట్లు చెప్పి, మళ్లీ మరొకిరికి అవకాశం ఎలా ఇస్తారంటూ వాదనకు దిగారు. ఏ షాప్‌నకు డీడీ కడుతారో అదే షాప్‌నకు వేలం పాడాలని, ఒకటి చెల్లించి, అన్నింటికి ఎలా వేలం పాడుతారంటూ పలువురు అభ్యంతరం చెప్పారు. నిబంధనల మేరకే అనుమతిస్తున్నామని అధికారులు సర్ధి చెప్పారు.
నిబంధనల ప్రకారం
నగరపాలకసంస్థ నిబంధనల మేరకు రిజర్వేషన్ కేటగిరీ వారిగా బహిరంగ వేలం నిర్వహించినట్లు నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. వేలంలో షాప్‌లు పొందిన వ్యాపారుల కు మూడేళ్ల కాలపరిమితితో అద్దె ప్రాతిపదికన కేటా యించామన్నారు. డిపాజిట్ కింద ఒక్కోషాప్‌నకు రూ.2లక్షలు చెల్లించాలన్నారు. వేలంలో చెల్లించిన రూ.10 వేలు డీడీని మినహాయించి రూ.1.90 లక్షలు మూడు రోజుల్లో డిపాజిట్ చేయాలన్నారు. మూడు నెలలు అడ్వాన్స్ చెల్లించాలన్నారు. ఏడు రోజుల్లో షాప్‌ల ఒప్పందం చేసుకోవాలన్నారు. డిపాజిట్‌లో ఎస్సీ ఎస్టీ, వికలాంగులకు మినహాయింపు ఉంటుందన్నారు. డిప్యూటీ కమిషనర్ ఖాధర్ మొహియుద్దీన్, ఆర్‌వో శివప్రసాద్, ఆర్‌ఐలు కిష్టయ్య, కలిముల్లాఖాన్ పాల్గొన్నారు.