
‘నిఘా’ నిరంతరం
● సోలార్ సీసీ కెమెరాల ఏర్పాటుకు పోలీసుల శ్రీకారం ● పలు గ్రామాల్లో 20కి పైగా బిగింపు
వీణవంక(హుజూరాబాద్): గ్రామాల్లో సీసీ కెమెరాల నిఘా నిరంతరం కొనసాగనుంది. గతంలో ఇంటర్‌నెట్ ద్వారా పని చేసే కెమెరాల్లో పిడుగు, వర్షం, గాలివీచిన సమయాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తేవి. మరమ్మతు చేయడం పోలీసులకు సవాల్‌గా మారింది. ఈ సమస్యను అధిగమించేందుకు సోలార్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. సోలార్ సీసీ కెమెరాలు నిరంతరం పని చేయనున్నాయి. గతంలో ఎస్సైగా పని చేసిన శేఖర్‌రెడ్డి మండల పరిధిలో సుమారు 90కి పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇటీవల విధుల్లో చేరిన రూరల్ సీఐ లక్ష్మీనారాయణ, ఎస్సై తిరుపతి సోలార్ కెమెరాలపై దృష్టిపెట్టారు.
ఠాణా నుంచే నిఘా
వీణవంక మండలంలో 26 గ్రామ పంచాయతీలు ఉండగా, 52వేల జనాభా ఉంది. గతంలో సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో నేరాలను పసిగట్టడం పోలీసులకు తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో గ్రామాల్లో నేరాల నియంత్రణతోపాటు నేరస్తులను గుర్తించేందుకు సోలార్ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్సై తిరుపతి విస్తృతంగా అవగాహన కల్పించారు. దాతల సాయంతో మండలవ్యాప్తంగా 20కి పైగా ఏర్పాటు చేశారు. ఒక్కో కెమెరాకు రూ.15వేలు వెచ్చించారు. ఇందులో సిమ్ కార్డును ఏడాది పాటు రిచార్జ్ చేశారు. వీటిని పోలీస్‌స్టేషన్‌కు అనుసందానం చేశారు. మనిషి కదలిక, మాటలు రికార్డు అవుతుండడంతో ఆకతాయిలు జంకుతున్నారు. నెలలోపు మరిన్ని ఏర్పాటు చేస్తామని ఎస్సై తెలిపారు. 50మందికి పైగా జనసంచారం ఉన్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.
అక్రమ కార్యకలాపాలకు చెక్?
గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట పడనుంది. నేరాల నియంత్రణ, నిందితులను త్వరగా పట్టుకోవచ్చు. చల్లూరు, కోర్కల్, పోతిరెడ్డిపల్లి గ్రామాల నుంచి ఇసుక అక్రమ రవాణ జరుగుతుంది. కెమెరాలు ఏర్పాటు చేస్తే ట్రాక్టర్లను గుర్తించి చర్యలు తీసుకునే వీలుంటుంది.
దాతలు ముందుకు రావాలి
గ్రామాల్లో ఎలాంటి ఘటన జరిగినా సీసీ కెమెరాలతో గుర్తించవచ్చు. సీపీ ఆదేశాల మేరకు ఇప్పటి వరకు దాతల సాయంతో 20 సోలార్ కెమెరాలు ఏర్పాటు చేశాం. గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నాం. కెమెరాల ఏర్పాటుకు దాతలు ముందుకురావాలి.
– తిరుపతి, ఎస్సై, వీణవంక

‘నిఘా’ నిరంతరం