
సహనాన్ని పరీక్షించొద్దు
● పెండింగ్ పనులు పూర్తి చేయాలి ● ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో పెండింగ్ పనులు పూర్తి చేసి ప్రజల కష్టాలను తీర్చాలని, తమ ఓపికను పరీక్షించొద్దని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధికారులను హెచ్చరించారు. నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్‌ని మంగళవారం ఆయన చాంబర్‌లో కలిసి నగరంలో పెండింగ్ పనులు, సమస్యల పరిష్కారంపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో అభివృద్ధి పనులు నిలిచిపోయి ఏడాదిన్నర దాటిందన్నారు. సీఎంఏ అసంపూర్తి పనులతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రజల ఇబ్బందుల దృష్ట్యా పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. తాము ఆందోళనకు దిగే పరిస్థితి తీసుకురావద్దన్నారు. సర్కస్‌గ్రౌండ్‌లో చిల్డ్రన్ పార్క్ పక్కన సబ్‌స్టేషన్ నిర్మాణం చేపట్టడం సరికాదని, మరో స్థలం చూడాలన్నారు. ఐడీఎస్‌ఎంటీ షాపింగ్ కాంప్లెక్స్ వినియోగంలోకి రావడం సాధ్యం కాదని, ఆధునీకరణ పేరిట నిధులు వెచ్చించడంపై పునరాలోచించాలన్నారు. సీతారాంపూర్, ఆరెపల్లిల్లో సమస్యలు పరిష్కరించాలన్నారు. రేకుర్తిలో ఖాళీ స్థలాలకు ఇంటినంబర్లు తీసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. స్పందించిన కమిషనర్ సర్కస్‌గ్రౌండ్‌లో సబ్‌స్టేషన్ పనులు నిలిపివేశామన్నారు. పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు డీపీఆర్ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు గందె మాధవి, వాల రమణారావు, బండారి వేణు, ఐలేందర్ యాదవ్, కుర్ర తిరుపతి, తోట రాములు పాల్గొన్నారు.