
ఎస్జీఎఫ్ క్రీడలకు ఏర్పాట్లు
● 27లోపు మండల, సెప్టెంబర్ 15లోపు జిల్లాస్థాయి పోటీలు ● జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైనీ
కరీంనగర్‌స్పోర్ట్స్: జిల్లాలో 2025–26 విద్యా సంవత్సరంలో ఎస్జీఎఫ్ క్రీడలు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైనీ పేర్కొన్నారు. ఈనెల 18వ తేదీ నుంచి 27వ తేదీ లోపు మండల, సెప్టెంబర్ 15వ తేదీ లోపు జిల్లాస్థాయిలో క్రీడాపోటీలు నిర్వహించాలన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో మంగళవారం నిర్వహించిన ప్రభుత్వ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయుల, క్రీడా సమాఖ్య వార్షిక సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎస్జీఎఫ్ క్రీడల నిర్వహణలో జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయులు చురుగ్గా పాల్గొనాలని తెలిపారు. ఎస్జీఎఫ్ కార్యదర్శి వేణుగోపాల్ మాట్లాడుతూ గతేడాది 48క్రీడాంశాలలో జిల్లాస్థాయి పోటీలు నిర్వహించామన్నారు. 6,300మంది విద్యార్థులు పాల్గొన్నారని, వివిధ రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా నుంచి 918మంది విద్యార్థులు ప్రతిభ చాటారన్నారు. జిల్లా విద్యాశాఖ సెక్టోరియల్ ఆఫీసర్ అశోక్‌రెడ్డి, డీసీఈబీ కార్యదర్శి ఎం. స్వదేశ్‌కుమార్, వ్యాయామ విద్య సంఘాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శంకరయ్య, శ్రీనివాస్, సీహెచ్.శ్రీనివాస్ పాల్గొన్నారు.