
మానేరు రివర్‌ఫ్రంట్ పూర్తిచేస్తాం
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో మిగిలిపోయిన పనులతో పాటు, మానేరు రివర్ ఫ్రంట్‌ను పూర్తి చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. నగరంలో రూ.4.79 కోట్ల నిధులతో నిర్మించనున్న సుడా వాణిజ్య భవన సముదాయం, ఐడీఎస్‌ఎంటీ షాపింగ్ కాంప్లెక్స్ ఆధునీకరణకు సోమవారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రణాళికాబద్ధంగా నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ హయాంలోనే శాతవాహన యూనివర్సిటీని నెలకొల్పామని గుర్తు చేశారు. ఉమ్మడి జిల్లాలో త్వరలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు అవుతాయని తెలిపారు.
త్వరగా పూర్తి చేయాలి
కలెక్టరేట్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశించారు. సుడా కార్యాలయంలో కలెక్టర్ పమేలా సత్పతితో కలెక్టరేట్ నిర్మాణంపై చర్చించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాతో ఫోన్‌లో మాట్లాడారు. మానకొండూరు, చొప్పదండి ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, నగరపాలక కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్, ఆర్‌డీవో మహేశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు కటకం మృత్యుంజయం, ఆరెపల్లి మోహన్ తదితరులు పాల్గొన్నారు
‘పొన్నం’ గైర్హాజరు
నగరంలో సోమవారం జరిగిన సుడా శంకుస్థాపనకు మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా పొన్నంకు ప్రొటోకాల్ ప్రకారం ఆహ్వానం అందలేదని, కేవలం సెల్‌ఫోన్ సందేశంతో సరిపెట్టారని ఆయన అనుచరులు చెబుతున్నారు. నగరంలో తనకు చెప్పకుండా కార్యక్రమం ఏర్పాటు చేయడమే కాకుండా, సరైన విధానంలో ఆహ్వానించకపోవడంపై మంత్రి ఆగ్రహంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
● మంత్రి శ్రీధర్‌బాబు