
రేకుర్తిలో 1,002 ఇంటి నంబర్లు రద్దు?
● విచారణలో అక్రమమని తేలినట్లు సమాచారం
కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ బల్దియా పరిధిలోని రేకుర్తిలో అక్రమంగా జారీ చేసిన 1,002 ఇంటి నంబర్లు రద్దు చేయాలని జిల్లా ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు సమాచారం. కొన్నేళ్లుగా వివాదాస్పద ప్రాంతంగా గుర్తింపు పొందిన రేకుర్తిలో ప్రభుత్వ, ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లు ఇచ్చిన వ్యవహారం వెలుగు చూడడం తెలిసిందే. రేకుర్తిలో ఇంటి నంబర్ల దందాపై పలుమార్లు ‘సాక్షి’ కథనాల మేరకు స్పందించిన అధికారులు గత నెలలో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. విచారణలో 1,002 ఇంటి నంబర్లు అక్రమమేనని తేల్చినట్లు విశ్వసనీయ సమాచారం. రేకుర్తిలోని ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసేందుకు, వివాదాస్పద స్థలాలను సొంతం చేసుకునేందుకు ఇంటినంబర్లను ఉపయోగించడం సర్వసాధారణంగా మారింది. స్థలాల్లో ఇళ్లు లేకున్నా ఇంటి నంబర్లు ఇవ్వడం, చిన్న షెడ్‌కు నంబర్ వేయడం లాంటి అక్రమాలతో కోట్లాది రూపాయల స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి.
చొప్పదండిలో సోలార్ పవర్‌ప్లాంటు
● శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
చొప్పదండి: పట్టణ శివారులోని పీఏసీఎస్ స్థలంలో ఒక మెగావాట్ సోలార్ పవర్‌ప్లాంట్‌కు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సోమవారం శంకుస్థాపన చేశారు. చొప్పదండి పీఏసీఎస్ ఆధ్వర్యంలో తొలిసారిగా పవర్ ప్లాంటు నిర్మాణానికి శంకుస్థాపన చేసి సరికొత్త రికార్డు సృష్టించారు. నాబార్డు డీడీఎం జయప్రకాశ్ ఈ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. రోజుకు 4,500 యూనిట్ల కరెంటు ఉత్పత్తి లక్ష్యంగా సోలార్ పవర్ ప్లాంట్ చేపట్టినట్లు వివరించారు. ఉత్పత్తి అయిన కరెంట్‌ను చిట్యాలపల్లి సబ్‌స్టేషన్‌కు పంపించడం జరుగుతుందని తెలిపారు. జాతీయ ఉత్తమ పీఏసీఎస్ అవార్డు గ్రహీత వెల్మ మల్లారెడ్డి మాట్లాడుతూ, బహుముఖ సేవలు అందించడంతోనే తమ సంఘం జాతీయ స్థాయిలో ముందుందని తెలిపారు.