
వ్యవసాయ మార్కెట్ గోదాంలో అగ్నిప్రమాదం
మెట్‌పల్లి(కోరుట్ల): మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌లోని గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భారీగానే నష్టం జరిగినట్లు తెలుస్తోంది. గోదాంలో సివిల్ సప్‌లై శాఖ అధికారులు సుమారు 9లక్షల పనికి రాని, 10 వేలు పనికి వచ్చే గన్నీ సంచులను నిల్వ ఉంచారు. అయితే ఆదివారం ఉదయం ఒక్కసారిగా గోదాంలో మంటలు చెలరేగాయి. గమనించిన సిబ్బంది వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. కానీ, మంటలు అదుపులోకి రాకపోవడంతో మరో రెండు ఫైర్ ఇంజన్‌లను రప్పించారు. కొన్ని గంటల పాటు అగ్నిమాపక శాఖ సిబ్బంది శ్రమించినప్పటికీ మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదు. అప్పటికే గోదాంలోని గన్నీ సంచులు పూర్తిగా కాలిపోయాయి. సంఘటన స్థలాన్ని ఎస్పీ అశోక్‌కుమార్, మెట్‌పల్లి ఆర్డీవో శ్రీనివాస్, నిజామాబాద్ జిల్లా ఫైర్ ఆఫీసర్ పరమేశ్వర్, డీఎస్పీ రాములు, సీఐ అనిల్‌కుమార్, ఎస్సై కిరణ్‌కుమార్, ఏఎంసీ చైర్మన్ గోవర్ధన్, సివిల్ సప్‌లై అధికారులు పరిశీలించారు. గోదాంలో ఓ చోట కిటికీ తెరిచి ఉండగా ఎవరైనా ఆకతాయిలు అందులో నుంచి మంటలు పెట్టారా..? లేదా మరే ఇతర కారణాల అన్న కోణంలో ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ ప్రమాదంలో భారీగానే నష్టం జరిగిందని చెబుతున్న అధికారులు ఎంత నష్టం జరిగిందనేది మాత్రం వెల్లడించలేదు.
పెద్ద సంఖ్యలో కాలిబూడిదయిన గన్నీ సంచులు