
తండ్రి మందలించాడని ఇంటి నుంచి వెళ్లిన కొడుకు
● రాత్రంతా గాలింపు చేపట్టిన కుటుంబ సభ్యులు
● ఏమైందో తెలియక ఆందోళన
● 12 గంటల తర్వాత ఇంటికి చేరిన బాలుడు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): తండ్రి మందలించాడని పదకొండేళ్ల బాలుడు 12 గంటలు కనిపించకుండా పోయాడు. ఈ సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఆదివారం కలకలం రేపింది. బాలుడు కనిపించకుండా పోయిన ఘటనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు బాలుడు 12 గంటల తర్వాత ఇంటికి తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన అంతెర్పుల శ్రీనివాస్–స్రవంతి దంపతుల కుమారుడు రోహిత్(11) బైక్ నడుపుతూ ప్రమాదానికి గురికాగా, స్వల్పంగా గాయపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న తండ్రి శ్రీనివాస్ ఇకపై బండి నడపొద్దని రోహిత్‌ను శనివారం మందలించాడు. దీంతో శనివారం రాత్రి నుంచే కనిపించకుండా పోయాడు. రాత్రి పొద్దుపోయే వరకు కుమారుడు ఇంటికి రాకపోవడంతో బంధువుల ఇళ్లల్లో గాలించారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రంతా అందరు రోహిత్ కోసం టెన్షన్‌గా చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. అయినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో రోహిత్ తనే స్వయంగా ఇంటికి తిరిగిరావడంతో తల్లి ఒక్కసారిగా భావోద్వేగానికి గురై రోధించింది. బాలుడు క్షేమంగా ఇంటికి చేరడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.