
తేలని గుట్ట గుట్టు!
● లేని రాక్‌కు రూ.80 లక్షలు ● ఆపై ఎంబీకి రెక్కలు ● ఏఈపై వేటు పడి నెల రోజులు ● ముందుకు కదలని చర్యలు ● విచారణ పేరిట కాలయాపన
కరీంనగర్ కార్పొరేషన్:
నగరంలోని కిసాన్‌నగర్ సమీకృత మార్కెట్ నిర్మాణంలో లేని గుట్టను తవ్వి రూ.80 లక్షలు స్వాహా చేసిన వ్యవహారాన్ని అటకెక్కించే పని గుట్టుగా సాగుతోంది. రూ.లక్షలు స్వాహా చేసి, ఆపై అక్రమాలు బయట పడతాయని ఎంబీ మాయం చేసి ఏళ్లు గడుస్తున్నా ఎటూ తేలడం లేదు. పావుగా మారిన ఏఈని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు, తదుపరి చర్యలపై ఎటూ తేల్చడం లేదు.
లేని గుట్టను తొలిచారట
కిసాన్‌నగర్ వ్యవసాయ మార్కెట్ ఆవరణలో రెండేళ్ల క్రితం పట్టణ ప్రగతి నిధులు రూ.5.80 కోట్లతో నగరపాలక సంస్థ సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు చేపట్టింది. నిర్మాణ సమయంలోనే అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు ఆరోపణలొచ్చాయి. మార్కెట్ ఆవరణలో గుట్టను తవ్వడానికి రూ.80 లక్షలు ఖర్చయ్యాయంటూ బిల్లు పెట్టడం అక్రమాలకు పరాకాష్టగా నిలిచింది. అసలు మార్కెట్ యార్డ్‌లో గుట్ట ఎక్కడుందంటూ స్థానికులు సైతం నోళ్లు వెళ్లబెట్టిన పరిస్థితి. విషయం బయటకు పొక్కడంతో, రాక్‌టింగ్‌కు సంబంధించిందిగా చెబుతున్న ఎంబీ–152 మాయమైంది. ఆ ఎంబీ దొరికితే, లేని రాక్‌ను కట్ చేసినట్లు తేలుతుందని, అందుకే మాయం చేశారంటూ ఫిర్యాదులొచ్చాయి. ఇదేసమయంలో ఎంబీ– 152 పోయిందంటూ సర్టిఫైడ్ కాపీ కోసం సంబంధిత కాంట్రాక్టర్ చిందం శ్రీనివాస్ గతేడాది ఆగస్టులో వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఏఈ వద్ద ఉండాల్సిన ఎంబీ పోయిందని కాంట్రాక్టర్ ఫిర్యాదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ తతంగంపై ‘సాక్షి’లో వచ్చిన వరుస కథనాల నేపథ్యంలో రూ.80 లక్షలు బిల్లు చేశారనేది అబద్దమని, రూ.1,99,468 మాత్రమే చెల్లించామని సంబంధిత ఏఈ అబ్దుల్ గఫూర్ పేరిట అప్పట్లో ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఏడాది గడిచినా, ఎంబీ మాయం అంశాన్ని పట్టించుకున్నవాళ్లు కరువయ్యారు. ఇటీవల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రఫుల్‌దేశాయ్ ఈ వ్యవహారంపై దృష్టి సారించారు. మొదటి బాధ్యుడిగా ఏఈ అబ్దుల్ గఫూర్‌పై సస్పెన్షన్ వేటు వేశారు.
సస్పెన్షన్‌కు నెల రోజులు
ఎంబీ మాయంపై ఏడాది గడిచిన తరువాత తొలి వేటు ఏఈ పైపడింది. మార్కెట్ అక్రమాలపై కదలిక వచ్చిందని, ఇక బాధ్యులపై చర్యలు ఉంటాయనుకుంటున్న క్రమంలో నెల రోజులు దాటినా చడీచప్పుడు లేకుండా పోయింది. సాంకేతికంగా ఎంబీ సంబంధిత ఏఈ దగ్గర ఉండాల్సిందే కాబట్టి, ఆయన సస్పెండ్‌కు గురయ్యారు. ఏఈపై గత జూలై 1వ తేదీన వేటు పడగా, నెల రోజులు దాటినా మళ్లీ ఈ వ్యవహారం ఊసే లేకుండా పోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
నిగ్గు తేల్చాల్సిందే
ప్రజల సొమ్ము సుమారు రూ.80 లక్షలు స్వాహా చేయడం, అది బయటపడుతుందని ఏకంగా ఎంబీ మాయం చేసిన వ్యవహారంలో నిజాలను నిగ్గుతేల్చాల్సిన అవసరం ఉన్నతాధికారులపై ఉంది. స్మార్ట్‌సిటీ, పట్టణ ప్రగతి నిధులు ఏవైనా అందినకాడికి దోచుకోవడం, ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోకపోవడం బల్దియాకు రివాజు గా మారింది. కాని ఇటీవల బాధ్యతలు చేపట్టిన కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ ఈ వ్యవహారంపై దష్టిసారించి తొలివేటు వేశారు. అదే తరహాలో విచారణను ఇతరులపై ఆధారపడకుండా, నేరుగా దృష్టి సారిస్తే తెరవెనక ఉన్న పాత్రలు బయటపడుతాయి. అప్పనంగా కాజేసిన లక్షల రూపాయల ప్రజల సొమ్ము రికవరీ అయ్యే అవకాశముంది.
కావాలనే కాలయాపన?
ఎంబీ మాయం వ్యవహారంపై కావాలనే కాలయాపన చేస్తున్నారనే విమర్శలున్నాయి. విచారణల పేరిట అధికారులను నియమించడం, వారు విచారణను ఎటూ తేల్చకపోవడం సంవత్సర కాలంగా ఓ తంతుగా సాగుతోంది. సుమారు రూ.80 లక్షల అక్రమ బిల్లు, ఎంబీ 152 మాయం కావడంలో కీలకంగా ఉన్న ఓ అధికారి నేతృత్వంలోనే నడుస్తున్నట్లు ప్రచారంలో ఉంది. సదరు అధికారిని, వెనుక ఉన్న సూత్రధారులను కాపాడేందుకే ఎంబీ మాయంపై కాలయాపన చేస్తున్నట్లు సమాచారం.

తేలని గుట్ట గుట్టు!