
అంగట్లో సబ్సిడీ సిలిండర్లు
నగరంలోని ప్రముఖ హోటల్ ఇది. ఇక్కడ రాయితీ గ్యాస్ సిలిండర్ల వినియోగమే ఎక్కువ. గెజిటెడ్, నాన్‌గెజిటెడ్ అధికారులు ఇక్కడే టిఫిన్ చేస్తుంటారు. అధికారులకు కళ్ల ముందే కనిపిస్తున్నా కబోదిలా వ్యవహరిస్తున్నారు.
కరీంనగర్ అర్బన్: పేదలకు అందిస్తున్న సబ్సిడీ సిలిండర్లు అంగట్లో అధిక ధరలకు అమ్ముడవుతున్నాయి. ఖర్చును తగ్గించుకునేందుకు ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు, ప్రభుత్వ, ప్రైవేట్ హాస్టళ్లు, ఆసుపత్రుల్లో వీటినే వినియోగిస్తున్నారు. ఇంత భారీ మొత్తంలో సిలిండర్లు పక్కదారి పడుతుంటే పౌరసరఫరాలశాఖ చోద్యం చూడటం గమనార్హం. గతంలో ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించగా కలెక్టర్ ఆదేశాల క్రమంలో తనిఖీల పేరుతో హడావుడి చేసిన పౌరసరఫరాలశాఖ చర్యలను కేవలం పాత్రదారుల వరకే పరిమితం చేసింది. ప్రస్తుతం రాయితీ సిలిండర్‌కు రూ.925 కాగా కమర్షియల్ సిలిండర్‌కు రూ.1915. దీంతో అక్రమార్కులు రాయితీ గ్యాస్‌ను బ్లాక్‌లో కొనుగోలు చేస్తూ ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు.
రెస్టారెంట్లు, హాస్టళ్లు అన్నింటా ఇవే సిలిండర్లు
జిల్లాకేంద్రంతో పాటు హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి, కొత్తపల్లి, శంకరపట్నం, మానకొండూరు తదితర ప్రాంతాల్లో దర్జాగా రాయితీ సిలిండర్లు పక్కదారి పడుతున్నాయి. రాయితీ గ్యాస్ గృహ అవసరాలకే వినియోగించాల్సి ఉండగా జిల్లాలో అంతటా ఇవే కనిపించడం యంత్రాంగ పనితీరుకు తార్కాణం. జిల్లాకేంద్రంలో వేయివరకు టిఫిన్ సెంటర్లు ఉండగా ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లు 200 వరకు ఉండగా హాస్టళ్లు 150వరకు ఉన్నాయి. హెచ్చుప్రాంతాల్లో రాయితీ గ్యాస్‌నే వినియోగిస్తున్నారు. పలు హోంనీడ్స్ దుకాణాలు అక్రమ గ్యాస్ సిలిండర్ల వ్యాపారానికి అడ్డాగా మారాయి. రోజుకు వందల సంఖ్యలో మినీ సిలిండర్లు విక్రయిస్తూ రూ.లక్షలు వెనకేసుకుంటున్నారు. జనావాసాల మధ్య కార్లలో గ్యాస్ నింపే దందా ఎక్కువగా సాగుతోంది. భగత్‌నగర్, కోతిరాంపూర్, మంకమ్మతోట, రాంనగర్, విద్యానగర్, సీతారాంపూర్ తదితర ప్రాంతాల్లో దందా నిర్వహిస్తున్నారు.
అంతా హడావుడి.. అంతలోనే మౌనం
ఏకకాల దాడులతో గుండెల్లో గుబులు రేపిన పౌరసరఫరాలశాఖ అంతలోనే మౌనం దాల్చడం విమర్శఽలకు తావిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 4న జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగరావు, ఏసీఎస్వో బుచ్చిబాబు ఆధ్వర్యంలో కరీంనగరంలో మెరుపు దాడులు నిర్వహించి అక్రమంగా వినియోగిస్తున్న 102 రాయితీ సిలిండర్లను పట్టుకున్నారు. కేసులు నమోదు చేసి సూత్రదారులను గుర్తించకపోవడం విడ్డూరం. రాజకీయ ఒత్తిడితో పాటు మామూళ్ల బంధంతో అసలైన గ్యాస్ ఏజెన్సీ అక్రమార్కులను వదిలారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంవత్సరంలో ఇదొక్కటే పౌరసరఫరాలశాఖ చేసిన తనిఖీ కావడం గమనార్హం. కాగా.. విరివిగా తనిఖీలు చేస్తామని, నిఘాను తీవ్రతరం చేస్తామని పౌరసరఫరాల అధికారులు చెబుతున్నారు.
కరీంనగర్‌లోని గణేశ్‌నగర్‌కు చెందిన ఓ కిరాణాదుకాణం నిర్వాహకుడు కొన్నేళ్లుగా అక్రమంగా సబ్సిడీ సిలిండర్లు విక్రయిస్తున్నాడు. వివిధ కంపెనీల సిలిండర్లు డీలర్ల నుంచి బుక్ చేసుకుని, పదుల సంఖ్యలో దుకాణంలో నిల్వ ఉంచుతున్నాడు. అత్యవసరం ఉన్నవారికి అసలు ధరకన్నా.. రూ.400 వరకు అధికంగా వసూలు చేస్తూ విక్రయిస్తున్నాడు. గ్యాస్ కంపెనీ డీలర్లు, అధికారులకు విషయం తెలిసినా చోద్యం చూస్తున్నారు.
అధిక ధరకు విక్రయాలు
హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లలో వినియోగం
రీఫిల్లింగ్‌తో మరో రకం దందా
చోద్యం చూస్తున్న అధికారులు

అంగట్లో సబ్సిడీ సిలిండర్లు